చివరిరోజైన విదేశీ పర్యటనలో భాగంగా ఒమన్‌లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం మస్కట్‌లోని 300 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని సందర్శించనున్నట్లు సమాచారం. అనంతరం ఆయన 300,000 టన్నుల భారతీయ ఇసుకరాయితో నిర్మించిన సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీద్‌ను కూడా సందర్శించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం ఒమన్‌కు వచ్చిన ప్రధానికి ఆతిథ్య దేశం ఘనంగా ఆహ్వానించింది. మోదీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉప ప్రధానమంత్రి కౌన్సిల్ సయ్యద్ ఫహ్ద్ బిన్ మహ్మద్ అల్ సయీద్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కోఆపరేషన్ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి సయ్యద్ అసిద్ బిన్ తారిఖ్ అల్ సయీద్‌లతో భేటీ అయ్యారు.


మస్కట్‌లోని సుల్తాన్ ఖబూస్ స్టేడియంలో 20,000 మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం యొక్క 'ఈజ్ ఆఫ్ లివింగ్' విధానాన్ని నొక్కి చెప్పారు. "సామాన్య ప్రజల జీవితాలను సులభం చేయడానికి 'కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పరిపాలన' పై దృష్టి పెట్టాము' అన్నారు. ఈ క్రమంలోనే ఆయన భారత దేశంలో రైల్వే వ్యవస్థ, ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు ప్రజల సంక్షేమానికి ఉద్దేశించినవి అని అన్నారు. ఒమన్ పర్యటన ముగించుకొని ప్రధానమంత్రి మోదీ ఫిబ్రవరి 12న న్యూఢిల్లీకి బయదేరుతారు.