కర్ణాటకలో తమ పార్టీని ఆదరించి, అతి పెద్ద పార్టీగా అవతరించేలా చేసిన కర్ణాటక ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో బీజేపీకి ఓటేసి ఆదరించిన ప్రతీ సోదర, సోదరీమణులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పార్టీని గెలిపించడం కోసం అహర్నిశలు కృషిచేసిన పార్టీ కార్యకర్తలకు సైతం ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని మోదీ అన్నారు. దేశంలో కొంతమంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. ఉత్తర భారత్, దక్షిణ భారత్ మధ్య విభేదాలు తీసుకొచ్చారు. కానీ వాస్తవానికి అటువంటిదేమీ లేదని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి అని మోదీ అభిప్రాయపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్నిసార్లు దేశంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లినప్పుడు, వారితో వాళ్ల బాషలో మాట్లాడలేకపోతున్నానే అనే భావన తనను వెంటాడేది. అయితే, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మాత్రం తనకు అటువంటి ఇబ్బంది ఏదీ ఎదురుకాలేదు. తాను ఏ భాషలో చెప్పినా అర్థం చేసుకుని ఆదరించారు కన్నడీగులకు రుణపడి వుంటానని అన్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


దేశంలో ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ ఈ ఎన్నికల పేరు చెప్పుకుని దేశంలో జాతి ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రపన్నడం సరైంది కాదు అంటూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు సంధించారు. కర్ణాటక రాష్ట్ర అభివృద్ధి విషయంలో బీజేపీ ఎప్పుడూ వెనుకడుగు వేయదని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు.