చమురు ఉత్పత్తి దేశాల సహకారం కోరిన ప్రధాని
చమురు ఉత్పత్తి దేశాల సహకారం కోరిన ప్రధాని
రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం మరోసారి దృష్టి సారించింది. సోమవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇంధన సంస్థల ప్రతినిధుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్‌తో పాటు విదేశీ ఇంధన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇంధనం ధరల పెరుగుదలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ పాల్గొన్నారు.
ప్రపంచ చమురు సరఫరాదారులు ధరలను సమీక్షించాలని ప్రధాని ఈ సమావేశంలో కోరారు. ఇంధనం ఉత్పత్తి చేస్తున్న దేశాలపైనే ఆయిల్ మార్కెట్ ఆధారపడి ఉంటుందన్న ఆయన.. ఆ దేశాలు అనుసరిస్తున్న మార్కెట్ వ్యూహాల వల్లే ఆయిల్ ధరలు పెరిగినట్లు అభిప్రాయపడ్డారు. దేశీయ రూపాయి విలువ పతనం కావడంతో పాటు.. చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఇంధనంపై ఆధారపడే దేశాలకు తీవ్ర ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని చమురు సంస్థల ప్రతినిధులకు తెలిపారు. అటు దేశంలో చమురు, గ్యాస్ వెలికితీతకు కొత్త పెట్టుబడులు రాకపోవడంపైనా మోదీ ఈ సమావేశంలో ఆరా తీసినట్లు సమాచారం.
సమావేశంలో పాల్గొన్న ఆయిల్ కంపెనీల సీఈవోలు, నిపుణులు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగేళ్లలో తీసుకున్న నిర్ణయాలను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను, ఎనర్జీ రంగంలో భారత్ చూపిస్తున్న చొరవను ప్రశంసించారు. పెట్టుబడి కోణంలో భారత్ ర్యాంక్ మెరుగైందన్నారు.
ఓ పది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్ రూ.2.50 తగ్గిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారులకు కొంత ఊరట లభించినప్పటికీ.. మళ్లీ ఇంధనం ధరలు పెరిగిపోయాయి. దీంతో మరోమారు సమావేశం నిర్వహించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.