ఎంపీల జీతాలెందుకు పెంచారని అడిగితే.. మరిన్ని సమస్యలు తేవద్దు అన్నారు: వరుణ్ గాంధీ
బీజేపీ నేత వరుణ్ గాంధీ మరోమారు సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. తాను ఎంపీల జీతభత్యాలు పెంచే విషయానికి వ్యతిరేకమని.. అదే మాటను గతంలో కూడా చెప్పానన్నారు.
బీజేపీ నేత వరుణ్ గాంధీ మరోమారు సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. తాను ఎంపీల జీతభత్యాలు పెంచే విషయానికి వ్యతిరేకమని.. అదే మాటను గతంలో కూడా చెప్పానన్నారు. కానీ తాను అలా మాట్లాడితే తనకు వెంటనే ప్రధానిమంత్రి కార్యాలయం నుండి ఫోన్ వచ్చిందని.. ఎందుకు సమస్యలు తెచ్చేవిధంగా మాట్లాడుతున్నావని అడిగారని వరుణ్ గాంధీ తెలిపారు. హర్యానాలోని బివానీ ప్రాంతంలో ఓ కళాశాల ఆహ్వానం మేరకు ప్రసంగించడానికి వెళ్లిన వరుణ్ గాంధీ అక్కడ పలు విషయాలపై తన ఆలోచనలు పంచుకున్నారు.
"సాధారణంగా జీతాలు ఎవరికి పెంచుతారు...? నిజాయతీతో, శ్రమతో పనిచేసే కార్మికులకు, ఉద్యోగులకు ఏ సంస్థలైనా జీతాలు పెంచుతాయి. కానీ రాజకీయ నాయకుల విషయం వేరు. గత 10 సంవత్సరాల్లో వారి జీతాలు 7 సార్లు పెరిగాయి. అదే విషయం నేను అడిగితే చాలు.. వెంటనే ప్రధాని ఆఫీసు నుండి ఫోన్ వస్తుంది. సమస్యలు తెచ్చే విధంగా మాట్లాడవద్దని హితవు పలుకుతుంది" అని వరుణ్ గాంధీ తెలిపారు.
అదే విధంగా ఉత్తర్ ప్రదేశ్‌లోని విద్యావ్యవస్థపై కూడా వరుణ్ గాంధీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. "ఈ రాష్ట్రంలో స్కూళ్లు చదువు చెప్పడం తప్ప అన్ని పనులూ చేస్తాయి. కొన్ని స్కూళ్లు అదనపు ఆదాయం కోసం పాఠశాల మైదానాలను పెళ్లిళ్ల ఫంక్షన్లకి, తద్దిన కార్యక్రమాలకు కూడా అద్దెకిస్తుంటాయి. అలాగే పిల్లలు కూడా చదువుకోవడానికి బదులు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు..రాజకీయ నాయకులు కూడా ఈ స్కూళ్లకు ప్రసంగాలివ్వడానికి మాత్రమే వస్తుంటారు. అంతే తప్ప ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడం నేను చూడలేదు" అని వరుణ్ గాంధీ అన్నారు. ప్రతీ సంవత్సరం దేశంలో రూ.3 లక్షల కోట్ల రూపాయలు విద్యారంగం పెట్టుబడి పెడుతుందని.. కానీ అందులో 89 శాతం డబ్బు స్కూలు బిల్డింగులు కట్టడానికే ఖర్చు పెడుతున్నారని ఆయన అన్నారు.