నీరవ్ మోదీ ఇంట్లో విలువైన సామగ్రి సీజ్
బ్యాంకులకు రూ.13వేల కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన నివాసంలో మూడు రోజుల పాటు సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు
బ్యాంకులకు రూ.13వేల కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన నివాసంలో మూడు రోజుల పాటు సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో అత్యంత విలువైన వస్తువులు బయటపడ్డాయి. ముంబైలో ఖరీదైన ప్రాంతం వోర్లీలోని సముద్ర మహల్ పేరుతో ఉన్న ఈ నివాసంలో ఎంఎఫ్ హుస్సేన్, కేకే హెబ్బర్, అమ్రిత షేర్ గిల్ లాంటి ప్రముఖులు వేసిన రూ.కోట్ల విలువైన పెయింటింగ్‌లు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు రూ.1.40 కోట్ల విలువైన గడియారాన్ని, రూ.10 కోట్ల విలువైన ఉంగరాన్ని కూడా సీజ్ చేశారు.
ప్రస్తుతం జరిగిన సోదాల్లో చిక్కిన సొమ్ము విలువ సుమారు 50 కోట్లపైనే ఉంటుందని అధికారులు తెలిపారు. నీరవ్ మోదీ, అతని మామ మోహుల్ చోక్సీలు బ్యాంకులకు సుమారు 13వేల కోట్లు ఎగవేసిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరూ ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఈ కేసులో గత నెలలో ఈడీ నీరవ్‌కు చెందిన 21 ఆస్తులను అటాచ్ చేసింది. ఆ ఇద్దరికీ సీబీఐ సమన్లు కూడా జారీ చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.1,200 కోట్ల మోసానికి పాల్పడినట్లు నీరవ్ మోదీ, అతని మామ మోహుల్ చోక్సీలపై రెండు మనీ లాండరింగ్ ఎఫ్ఐఆర్‌లను దాఖలు చేసింది సెంట్రల్ ప్రోబ్స్ ఏజెన్సీ. ఇందుకు సంబంధించి ఈడీ ఇప్పటికే గ్లోబల్ అరెస్టు వారెంట్ కోసం ఇంటర్‌పోల్‌ని కూడా సంప్రదించింది. ముంబాయి ప్రత్యేక కోర్టు ఈడీ అభ్యర్థన మేరకు ఆ ఇద్దరిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.