న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 95 లోక్ సభ నియోజకవర్గ స్థానాలకుగాను గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సహా మరో 13 రాష్ట్రాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తమిళనాడులోని వేలూరులో భారీగా నగదు పట్టుబడిన కారణంగా అక్కడి లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికలు నిలిపేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. 


రెండో విడత ఎన్నికల్లో మొత్తం 1629 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా వారిలో 427 మంది కోటీశ్వరులు ఉన్నారు. అందులోనూ 27 శాతం అభ్యర్థులు రూ.కోటికిపైగా ఆస్తులు కలిగి వున్నట్లు తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరో 11 శాతం మంది రూ.5 కోట్లపైన, 41 శాతం మంది అభ్యర్థులు రూ.10 లక్షల్లోపు ఆస్తులున్నట్లు అఫిడవిట్స్‌లో వెల్లడించారు. సుమారు 15 కోట్లకుపైగా ఓటర్లు రెండో విడత పోలింగ్‌లో పాల్గొనేందుకు అర్హులుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు.