ఇవాళ దేశ వ్యాప్తంగా మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. నేడు గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెర్రస్‌ , యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ తదితరులు రాజ్‌ఘాట్‌ వద్ద బాపూకు నివాళులర్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కూడా గాంధీకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. గాంధీ చూపిన అహింసా మార్గం అందరికీ ఆచరణీయమని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. ఉగ్రవాదం, ఇతర హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్న నేటి సమాజానికీ గాంధీ చూపిన అహింస ఆచరణీయమని పలువురు పేర్కొన్నారు. గాంధీ కేవలం భారత్‌కే కాదు.. యావత్ ప్రపంచ మానవాళికి భారత్‌ అందించిన గొప్ప బహుమతి అని అభివర్ణించారు. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గాంధీ చూపిన మార్గంలో పరిష్కారాలున్నాయన్నారు.  


జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించే ముందు ప్రధాని మోదీ.. 'మహాత్మాగాంధీ 150వ జయంతిలోకి అడుగుపెడుతున్న చారిత్రక రోజిది. ఆయన కలల్ని సాకారం చేసేందుకు ఇదో అద్భుత అవకాశం..' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బాపూకి నివాళులర్పించిన అనంతరం మోదీ విజయ్ ఘాట్‌లో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించారు.