ఈ ఏడాది రాష్ట్రపతి భవన్‌లో ఇఫ్తార్‌ విందు ఉండదని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిగా గతేడాది జులైలో రామ్‌ నాథ్‌ కోవింద్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బుతో మతపరమైన ఉత్సవాలు వేటినీ నిర్వహించరాదని నిర్ణయించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'రాష్ట్రపతిగా కోవింద్ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రపతి భవన్ వంటి ప్రభుత్వ ప్రాంగణాల్లో ప్రజల పన్నులతో మతపరమైన సంబరాలు వేటినీ నిర్వహించరాదని నిర్ణయించారు' అని రాష్ట్రపతి ప్రెస్‌ కార్యదర్శి అశోక్‌ మాలిక్‌ తెలిపారు.


ఒక్క ఇఫ్తారే కాదు.. దీపావళి, హోలీ, క్రిస్మస్ లాంటి మతపరమైన ఉత్సవాలను రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించరాదని రాష్ట్రపతి నిర్ణయించినట్లు అశోక్‌ మాలిక్‌ తెలిపారు. అయితే, అన్ని మతాలకు సంబంధించిన ప్రతి ప్రధాన పండుగకు రాష్ట్రపతి ప్రజలకు శుభాకాంక్షలు చెప్తారని పేర్కొన్నారు. లౌకిక ప్రభుత్వ స్ఫూర్తి, సూత్రానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.


ఒక్క అబ్దుల్‌కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో తప్ప ఎన్నో ఏళ్ల నుంచీ ప్రతి ఏటా రాష్ట్రపతి భవన్‌లో ఇఫ్తార్‌ విందు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించారు.


రంజాన్ మాసంలో ముస్లింలు సాయంత్రం ఉపవాస దీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని 'ఇఫ్తార్' అంటారు.