జలియన్‌వాలా బాగ్ అమరులకు రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోది, రాహుల్ గాంధీ నివాళి
జలియన్‌వాలా బాగ్ అమరులకు నివాళి అర్పించిన రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోది, రాహుల్ గాంధీ
జలియన్‌వాలా బాగ్‌లో మారణహోమం జరిగి నేటికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనలో అమరులైన వారికి ఘనంగా నివాళి అర్పించారు. 1919లో ఏప్రిల్ 13న అప్పటి బ్రిటీష్ సైనికాధికారి జనరల్ రెజినాల్డ్ డయర్ బ్రిటీష్ సైనికులచేత అమానుషంగా జరిపిన దాడిలో 379 మంది ప్రాణాలు కోల్పోగా 1500 మందికిపైగా బాధితులు బుల్లెట్ గాయాలపాలయ్యారు. రౌలత్ యాక్ట్‌కి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకునేందుకు ఒక్కచోట చేరి సమావేశమైన అమాయకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి రక్తపుటేరులు పారించిన డయ్యర్.. బ్రిటీష్-ఇండియా చరిత్రలో ఓ నరహంతకుడిగా మిగిలిపోయాడు.
జలియన్‌వాలా బాగ్ నరమేధంలో అమరులైన వీరుల త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ట్వీట్ చేశారు.
జలియన్‌వాలా బాగ్ దురంతంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలను ఈ గడ్డ ఎప్పటికీ మరవబోదని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అమరుల త్యాగాలే భారత్‌ను మరింత అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లేందుకు తమకు స్పూర్తినిస్తాయని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.