ఢిల్లీ: బుధవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సారి పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయని  ఆశాభావం వ్యక్తం చేశారు.  
ఈ సారి సమావేశాల్లో దేశ ప్రయోజనాల సంబంధించిన చాలా అంశాలు చర్చకురానున్నాయని... దీనిపై చర్చించేందుకు సభ్యులు సహకరించాలని ఈ సందర్భంగా మోడీ కోరారు. చర్చకు వచ్చే కీలక బిల్లులపై సభ్యులు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు . విలువైన సభా సమయాన్ని వృథా చేయకుండా చూసుకుందామని సభ్యులకు మోడీ పిలుపు నిచ్చారు. విపక్షాలు సహకరిస్తే  ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.


ఇదిలా ఉండగా నేటి నుంచి ప్రారంభమైన సమావేశాలు ఆగస్టు 10 వరకు కొనసాగుతాయి. ఈ వ్యవధిలో పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. టీడీపీ ఇచ్చిన అవిశ్వాసం తీర్మానంపై కూడా చర్చ జరగే అవకాశముంది.