నేడు భారత్ 73వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వివరాలు ఇలా వున్నాయి. గురువారం ఉదయం 7.05 గంటలకు రాజ్ ఘాట్ సందర్శించనున్న ప్రధాని మోదీ.. దేశానికి స్వాతంత్య్రం సంపాదించిపెట్టిన మన జాతి పిత మహాత్మా గాంధీకి ఘన నివాళి అర్పించనున్నారు. అక్కడి నుంచి 7.18 గంటలకు లాహోరి గేట్‌కు చేరుకోనున్న మోదీ.. అక్కడ ఎర్రకోటపై జాతీయ జండా ఎగరవేయనున్నారు. ఎర్రకోటపై నుంచే జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం 10 గంటలకు లోక్ కల్యాణ్ మార్గ్ లోని తన అధికారిక నివాసానికి చేరుకుంటారు. తన అధికారిక నివాసంలోనే ప్రధాని మోదీ రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌ని సందర్శించనున్నారు.


73 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వీవీఐపిలకి నెలవైన దేశ రాజధాని ఢిల్లీలో అడుగడుగునా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ), ఎన్ఎస్‌జి కమాండోలు, స్నైపర్స్, స్వాత్ బృందాలను మొహరించారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో 400కుపైగా ఫేషియల్ రికగ్నిషన్ పరిజ్ఞానం కలిగిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.