న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి కోసం కేంద్రం ప్రత్యేక విమానాలను సిద్ధం చేస్తోంది. సరికొత్త ఆధునిక విమానాలు 2020 నాటికి అందుబాటులోకి వస్తాయని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇటీవలనే ఎయిర్ ఇండియా బోయింగ్ 777-300 ఈఆర్‌లను కొనుగోలు చేశాయి.


ఈ రెండు బోయింగ్ విమానాలను వీవీఐపీలకు అనుగుణంగా మార్పు చేస్తారు. ప్రెస్‌కాన్ఫరెన్స్ రూమ్, వీఐపీ ఎన్‌క్లోజర్‌, అత్యవసర సమయాల్లో  వైద్య సదుపాయంలకు అనుగుణంగా మార్పు చేస్తారు. వైఫై సదుపాయం కలిగిన ఈ విమానాలు క్షిపణుల దాడులనూ తట్టుకోగలవు. ఇవి భారత్ నుంచి నేరుగా యుఎస్‌కు ఎక్కడా ఆగకుండా వెళ్లగలవు. ఇంధనం కోసం మధ్యలో ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఎయిర్ ఇండియా మూడు బోయింగ్-777 విమానాలను ప్రవేశపెట్టింది. 2006లో 68 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. వీటిల్లో రెండు విమానాలను కేవలం వీవీఐపీల కోసమే కేటాయిస్తారు. వీటిని ప్రభుత్వం ఎయిర్ ఇండియా నుంచి కొనుగోలు చేస్తుందని అధికారి తెలిపారు. ఎయిర్ ఇండియా నుంచి ఈ విమానాలను కొనుగోలు చేసేందుకు వీలుగా గత బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.4,469.50 కోట్లు కేటాయించింది. ఎయిర్ ఇండియా మొత్తం 44 మంది పైలెట్లను వీవీఐపీ విమానాలను నడపడానికి వినియోగిస్తుంది. వీరితో పాటు క్యాబిన్‌ సిబ్బంది, ఇంజనీర్లు, అత్యవసర సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు.