ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీ: అదే లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ ?
ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది. తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది. తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అభిమానించే వారిలో చాలామంది ప్రియాంకా గాంధీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారు. అనేక వేదికలపై, అనేక సందర్భాల్లో వారు తమ కోరికను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముందుంచారు. వారు ఆశించినట్టుగానే ఇవాళ ఆ క్షణం రానేవచ్చింది. ప్రియాంక గాంధీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితోపాటు తూర్పు ఉత్తర్ ప్రదేశ్ ప్రాంత ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కునేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ తాజా నిర్ణయం దేశ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామంగా మారింది.
ఇదిలావుంటే, ప్రస్తుతానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రియాంకా గాంధీ వాద్రా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాయ్ బరేలీ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతంలో మాదీ ప్రధాని ఇందిరా గాంధీ రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలవగా 1999 నుంచి 2014 వరకు నాలుగు పర్యాయాలు అదే స్థానం నుంచి సోనియా గాంధీ విజయం సాధిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరున్న రాయ్ బరేలి నుంచే ప్రియాంకా గాంధీ రాజకీయ సమరాన్ని మొదలుపెట్టించాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.