పార్లమెంట్‌ను తాకిన ఉల్లి ధరల నిరసనలు
ఉల్లి ధరలు కోయకుండానే సామాన్య మానవుడికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇదే విషయమై పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద అన్నీ పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పార్లమెంట్ సభ్యులు తమ నిరసన తెలియజేశారు.
న్యూఢిల్లీ: ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు కోయకుండానే సామాన్య మానవుడికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇదే విషయమై పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద అన్నీ పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పార్లమెంట్ సభ్యులు తమ నిరసన తెలియజేశారు. సామాన్య ప్రజలు, పెరుగుతున్న ఉల్లి ధరలపై తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని అన్నారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు చిదంబరం, అదీర్ చౌదరి, గౌరవ్ గొగోయ్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఉల్లి ధరలపై నిరసన చేపట్టారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కిలో ఏకంగా రూ.150కి చేరుకుంది. దీంతో విపక్షాలు లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తి అధికారపక్షాన్ని నిలదీశాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంద్యోపాధ్యాయ్ జీరో అవర్‌లో ఉల్లిపాయ ధరల అంశాన్ని లేవనెత్తారు. అక్రమ నిల్వల కారణంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, కేంద్రం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ సుదీప్ బంద్యోపాధ్యాయ్ డిమాండ్ చేశారు. నిరుపేదలు నిత్యం ఆహారంలో వాడే ఉల్లి ధరల్ని తగ్గించడానికి కేంద్రమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీలు డిమాండ్ చేశారు.
ఉల్లి ధరల పెంపుపై పార్లమెంట్‌లో ఎంపీలు ఆందోళన చేపట్టడం ఇదేం మొదటిసారి కాదు. రెండు రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సైతం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మెడలో ఉల్లిగడ్డల మాలను ధరించి తన నిరసన తెలియజేసిన సంజయ్ సింగ్.. ఉల్లి ధరలు భారీగా పెరగడం వెనుక కేంద్ర ప్రభుత్వం కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు.