భద్రతా బలగాల వల్లే నా కొడుకు ఉగ్రవాది అయ్యాడు: ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ తండ్రి
వల్లే నా కొడుకు ఉగ్రవాది అయ్యాడు: ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ తండ్రి
న్యూఢిల్లీ: పోలీసులు, భద్రతా బలగాలు తన కొడుకును అవమానించడం వల్లే తన కొడుకు ఉగ్రవాదిగా మారాడని సూసైడ్ బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ తండ్రి గులామ్ హసన్ దర్ తెలిపారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఆదిల్ అహ్మద్ ఆత్మాహుతి దాడి చేసి 40కిపైగా జవాన్లను పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో ఆదిల్ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన అంశాలను మీడియాతో పంచుకున్నారు. ''ఓ రోజు స్కూల్ నుంచి వస్తున్న ఆదిల్‌ను మధ్యలోనే అడ్డుకున్న భద్రతా బలగాలు వాడిని తీవ్రంగా కొట్టి, ముక్కు నేలకు రాయించారు. అంతేకాకుండా జీపు చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. భద్రతా బలగాల చేతిలో ఆ చేదు అనుభవాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆదిల్.. ఆ విషయాన్ని పదేపదే ప్రస్తావించేవాడు. కారణం లేకుండా ఎందుకు కొట్టారని అడుగుతుండేవాడు. అలా ఆ ఘటన గురించి పదేపదే ఆలోచించి సైనికులపైనే ద్వేషం పెంచుకున్నాడు. ఆ ద్వేషమే వాడిని ఉగ్రవాదులకు దగ్గరయ్యేలా చేసింది'' అని ఆదిల్ తండ్రి తెలిపాడు.
ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదిల్‌కు మేం చాలా సార్లు చెప్పిచూశాం. అయినా ఆదిల్ మా మాట వినలేదు. గతేడాది మార్చి నుంచి ఇంటికి రావడమే మానేసిన ఆదిల్ ఈ ఆత్మాహుతి దాడితో మాకు శాశ్వతంగా దూరమయ్యాడు. ఉగ్రవాదులకు దగ్గరైన ఆదిల్ ఇంత దారుణానికి ఒడిగడతాడని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్ల కుటుంబాలు అనుభవిస్తున్న క్షోభనే మేము కూడా అనుభవిస్తున్నాం'' అని ఆదిల్ తండ్రి మీడియాకు వివరణ ఇచ్చారు.
ఘటనాస్థలికి 10 కిమీ దూరంలోనే ఆదిల్ నివాసం ఉండగా.. అతడు పాఠశాల దశలోనే చదువును మధ్యలోనే మానేసిన విద్యార్థిగా ఆదిల్ పేరును వార్తల్లో చూసిన సంగతి తెలిసిందే.