న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు తరచుగా వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. సభలో ఓసారి కునికిపాట్లు పడుతూ కెమెరాకు చిక్కిన రాహుల్ గాంధీ మరోసారి కన్నుగీటి విమర్శలపాలయ్యారు. ఇక తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గురువారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనూ రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు ఆయనను విమర్శించే వారికి మరో అవకాశాన్ని ఇచ్చినట్టయింది. 


ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప్రసంగిస్తుండగా రాహుల్ గాంధీ మాత్రం తన ఫోన్‌లో ఏదో టైప్ చేస్తూ బిజీగా కనిపించారు. రాహుల్ గాంధీ ఫోన్‌తో బిజీగా వున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన బీజేపీకి చెందిన కిసాన్ మోర్చా.. ఓవైపు రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా మరోవైపు రాహుల్ గాంధీ ఫోన్‌తో బిజీగా ఉన్నారని తప్పుపట్టింది. రాష్ట్రపతి ప్రసంగం సుమారు గంటసేపు కొనసాగగా.. ప్రసంగంపై ఆసక్తి కనబర్చని రాహుల్ గాంధీ దాదాపు 25 నిమిషాలపాటు ఫోన్‌తోనే బిజీగా గడపడం చర్చనియాంశమైంది. దీనిపై రాహుల్ గాంధీ ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.