2 ప్రశ్నలతో ప్రధాని నరేంద్ర మోదీని నిలదీసిన రాహుల్ గాంధీ
ఇది దేశ ప్రధాని మౌనంగా వుండాల్సిన సమయం కాదు : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఉన్నావ్, కథువా అత్యాచార ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో లైంగిక నేరాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు నోరు విప్పడం లేదు అని ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. ఇది దేశ ప్రధాని మౌనంగా వుండాల్సిన సమయం కాదు అని గుర్తుచేశారు. యావత్ దేశాన్ని కుదిపేసిన ఉన్నావ్, కథువ ఘటనల నేపథ్యంలో.. లైంగిక నేరాల ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ ఇకనైనా పెదవి విప్పాలని ఈ సందర్భంగా ఆయన మోదీని డిమాండ్ చేశారు. ప్రధాని స్పందన కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది అంటూనే రెండు ప్రధానమైన ప్రశ్నలు అడిగి మోదీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ప్రధాన మంత్రి గారూ.. ఈ సమయంలో మీ మౌనం అంగీకరించిదగినది కాదు. మహిళలు, చిన్నారులపై పెరిగిపోతున్న నేరాలపై మీ అభిప్రాయం ఏంటి ? లైంగిక నేరాలకు పాల్పడుతున్న నిందితులు, హంతకులని ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది అని రాహుల్ నిలదీశారు.
ఇదిలావుంటే, ఉన్నావ్, కథువా దుర్ఘటనలపై నిరసన వ్యక్తంచేస్తూ గురువారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద రాహుల్ గాంధీ క్యాండిల్ మార్చ్ నిర్వహించి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా వంటి వారు కాంగ్రెస్ పార్టీ అధినేతకు సంఘీభావంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. లైంగిక నేరాలపై తాము జరుపుతున్న పోరాటంలో తమతో కలిసొచ్చి మద్ధతు పలికిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు రాహుల్ మరో ట్వీట్ చేశారు. ఆందోళనకారుల నిరసనలు వృధా కాబోవు అని కాంగ్రెస్ బాస్ తన ట్వీట్ ద్వారా ఆశాభావం వ్యక్తంచేశారు.