ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరగడానికి ముందు ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లే రాహుల్ గాంధీకి అక్కడి దేవాలయాలు, ప్రార్థనా స్థలాలను సందర్శించడం ఎప్పటి నుంచో వున్న అలవాటు. ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఎన్నికలకు ముందు ఇదే పద్ధతిని అనుసరించారు. ఇక గుజరాత్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల క్యాంపెయిన్ చేసినప్పుడు సుమారు 20 దేవాలయాలు సందర్శించారు. ప్రస్తుతం కన్నడనాట ఎన్నికల ప్రచారంతో బిజీగా వున్న రాహుల్ గాంధీ వైఖరి ఇక్కడ కూడా అందుకు భిన్నమేమీ కాదు. బుధవారం ఉదయం చిక్‌పేటలోని దొడ్డగణపతి దేవాలయంలో పూజల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ మధ్యాహ్నానికి బెంగుళూరులోని హజ్రత్ తవక్కల్ మస్తాన్ దర్గా వద్ద ప్రార్థనలు జరిపారు. సాయంత్రానికి బెంగుళూరులోని స్వామి ఆలయానికి చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడ జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 



 


 



 


బుధవారం రోజంతా అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూ ముందుకెళ్లిన రాహుల్ గాంధీ.. అక్కడక్కడా మార్గం మధ్యలో ఇలా వివిధ ప్రార్థనా మందిరాల్లో ప్రత్యక్షమవడం మీడియా దృష్టిలో పడకుండాపోలేదు. రాహుల్ గాంధీ అలవాటు గురించి తెలిసిన వాళ్లంతా ఈ విషయాన్ని తేలిగ్గానే తీసుకున్నప్పటికీ.. ఇంకొంతమంది మాత్రం సోషల్ మీడియా వేదికగా రాహుల్‌పై సరదాగా కామెంట్స్ రాసుకున్నారు.


కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న రాహుల్ గాంధీ.. బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా స్థానికంగా సిద్ధరామయ్య ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రశంసిస్తూ వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల ప్రచారంలో మధ్యమధ్యలో అనేక చోట్ల ప్రార్థనా మందిరాల్లోనూ రాహుల్ గాంధీ ప్రార్థనలు జరిపారు.