రాహుల్ గాంధీ.. ఈ పేరే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పెద్దదిక్కు. కేంబ్రిడ్జ్‌లోని రాలిన్స్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ డెవలప్‌మెంట్ డిగ్రీ చేసి.. నెహ్రు కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఈ యువతేజం ఒక రాజకీయవేత్తగా ఎదుర్కొన్న సమస్యలు, విమర్శలు అనేకం. తల్లి చాటు బిడ్డగా.. వేగంగా సంయమనం కోల్పోయే రాజకీయ నాయకుడిగా ఒకప్పుడు పలువురి నుండి ఆరోపణలు ఎదుర్కొన్న రాహుల్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పొందిన విజయాల కన్నా, పొందిన వైఫల్యాలే ఎక్కువ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 206 సీట్లను గెలుచుకుంటే.. 2014లో రాహుల్ సారథ్యం వహించిన భారత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 44 సీట్లు మాత్రమే గెలుపొంది ఘోరమైన వైఫల్యాన్ని చవిచూసింది. భారతావని అంతా మోదీ జపంలో కొట్టుకుపోయింది. అలాంటి సందర్భంలో తనదైన శైలిలో వేగంగానే కోలుకున్నారు రాహుల్. మోదీ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించాక.. తడబడుతూనే ప్రతిపక్షనేతగా ప్రభుత్వానికి పోటీ ఇవ్వడానికి ప్రయత్నించారు.


హైదరాబాద్‌లో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య జరిగినప్పుడు గానీ.. డీమానిటేజేషన్ అమలులోకి వచ్చి ప్రజలు నోట్లు మార్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నప్పుడు గానీ..జీఎస్‌టీ పై విమర్శల వెల్లువ కొనసాగినప్పుడు గానీ.. రాహుల్ ఏ అవకాశం కూడా వదులుకోలేదు. తనదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇటీవలే గుజరాత్ ఎన్నికల రథసారధిగా మోదీకి దీటుగా ప్రచారకర్తగా కూడా వ్యవహరించారు.


అయినా మోదీకున్న చరిష్మా రాహుల్‌కు కొన్ని విషయాల్లో లేదనే చెబుతుంటారు రాజకీయ నిపుణులు. స్థిరమైన ఎజెండా లేని నేతగా అతన్ని అభివర్ణిస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను విడదీసి.. కాంగ్రెస్ పాలకులు తెలంగాణను అందించినప్పుడు.. ఆంధ్రలో ఆ పార్టీ స్థితి అధోగతిపాలే అయ్యింది. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కాంగ్రెస్‌ను పక్కన పెట్టింది. అంటే ఈ రాష్ట్రాలలో యువతకు సైతం రాహుల్ పై గురి ఉండే అవకాశం లేదు. ఒక్క కర్ణాటక మినహా, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో కూడా రాహుల్ హవా ఏమీ లేదు. అంటే.. ఒక రకంగా దక్షిణాదిలో రాహుల్ ప్రభావం శూన్యం


ఇక ఉత్తరాదిలోనైనా కాంగ్రెస్ పాలకుల హవా ఏదైనా ఉందని అనుకుంటే.. అది కూడా ఎటూ కాని పరిస్థితే. యూపీలో ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వారి గురి ఎప్పుడూ కాంగ్రెస్‌కు వ్యతిరేకమే. ఇలాంటి సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ పై చాలా బాధ్యతలు ఉన్నాయి... బహుశా ఈ క్రింది అంశాలపై రాహుల్ దృష్టి కేంద్రీకరిస్తే ఆయనకు మళ్లీ మంచి కాలం వస్తుందేమో..! 


  • ముఖ్యంగా మోదీ ప్రభుత్వంలో విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందనే ఎప్పుడూ నమ్ముతుంటారు కొందరు ఆర్థిక నిపుణులు.ఉదాహరణకు గుజరాత్ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ గెలుస్తుందని తెలియగానే.. సెన్సెక్స్ లాభాల బాటలో పయనించడం గమనార్హం. అంటే ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో భారత్ పాత్రపై మోదీకున్నంత అవగాహన రాహుల్‌కి లేదనే కదా  అన్నది కొందరి వాదన..! అందుకే ఇలాంటి విషయాలపైనా రాహుల్ స్పందించాలి. కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థిక మేధావి ఉన్నా.. అలాంటి విషయాల పట్ల రాహుల్ వైఖరి ఏమిటో ఎప్పుడూ ఎవరికీ అర్థం కాని విధంగానే ఉంటుందనే వాదన పట్ల ఆయన ఎలాంటి సమాధానం ఇస్తారన్నది వేచి చూడాలి.


  • అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లును గట్టిగా సమర్థించిన రాహుల్, రాజకీయ నాయకుల్లో అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన లోక్‌పాల్‌ బిల్లు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది కూడా అతనిపై వ్యతిరేకతను పెంచే అంశమే. అన్నా హజారే లాంటి వారు ఈ విషయంలో రాహుల్‌ను ఎప్పుడో తూర్పారపట్టారు. అందుకే తన భవిష్యత్ ఎజెండాలో అవినీతి నిర్మూలనకు కాంగ్రెస్  అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది.. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటుందో రాహుల్ సూచిస్తే మంచిదేమో అంటున్నారు పలువురు సామాజికవేత్తలు.


  • అలాగే భారతదేశంలో పేదరిక నిర్మూలన పట్ల కూడా రాహుల్ అభిప్రాయాలేమిటో కూడా అందరికీ అర్థం కాని రీతిలోనే ఉంటాయని కొందరి అభిప్రాయం. ‘దారిద్య్రం అంటే ఓ మానసిక స్థితి. తినడానికి తిండి లేకపోవడమో, మరేంటో లేకపోవడము కాదు. ఆత్మ విశ్వాసం ఉంటే దారిద్య్రాన్ని ఎవరైనా జయంచవచ్చు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పలుమార్లు రాజకీయ పార్టీలకు దొరికిపోయారు. మరి భారతదేశంలో పేదరిక నిర్మాలన కోసం కాంగ్రెస్ గతంలో ఏం చేసింది.. భవిష్యత్తులో ఎలాంటి పథకాలు తీసుకొస్తుంది అన్న విషయంపై రాహుల్ ఒక క్లారిటీ ఇస్తే మంచిదేమో అంటున్నారు పలువురు రాజకీయవేత్తలు.


  • అలాగే మత పరమైన విషయాలతో పాటు మరియు యువతను సరిగ్గా అర్థం చేసుకోవడంలో రాహుల్ ఫెయిల్ అవుతున్నారన్నది కొందరి వాదన. ‘దేశంలో అల్లర్లు సృష్టించేందుకు నిరాశ, నిస్పృహ,  అసంతృప్తిలతో రగిలిపోతున్న భారత యువతను పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ నియమిస్తోందంటూ నాకో పోలీసు అధికారి చెప్పారు’  అని రాహుల్ గతంలో వ్యాఖ్యానించడంతో బీజేపీతో పాటు, ప్రధాన రాజకీయ పార్టీలు విరుచుకుపడ్డాయి. పలువురు పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఇలాంటి విషయాల్లో రాహుల్ అవగాహన శూన్యమని తేల్చారు. భవిష్యత్ కార్యాచరణలో ఇలాంటి విషయాలపై ఒక స్పష్టతను రాహుల్ అందివ్వాలి అని వారు కోరుకుంటున్నారు. కాశ్మీరీ యువతను అభద్రతాభావం నుండి దూరం చేయడానికి మరి రాహుల్ ఏదైనా చేయగలుగుతారా అన్నది కూడా ఓ ప్రశ్నే. ఏదేమైనా.. గుజరాత్ ఎన్నికల తర్వాత రాహుల్ నాయకత్వ పరిణితి పట్ల ప్రజలకు ఒక అంచనా వస్తుందనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాదిలో కర్ణాటక అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికలలో వచ్చే ఫలితాలు కూడా రాహుల్ భవితవ్యం ఏమిటో చెప్పకనే చెబుతాయి.