న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ''మేక్ ఇన్ ఇండియా - రేప్ ఇన్ ఇండియా'' వ్యాఖ్యలు పార్లమెంట్‌లో దుమారం రేపుతున్నాయి. నిన్న ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ దేశంలో 'మేక్ ఇన్ ఇండియా'కు బదులు 'రేప్ ఇన్ ఇండియా' అన్నట్లుగా పరిస్థితి తయారైందని మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాహుల్ దేశానికి క్షమాపణ చెప్పాలంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో.. బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. రాజ్యసభలోనూ బీజేపీ ఎంపీలు వెనక్కి తగ్గలేదు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు... సభ్యులను శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. రాజ్యసభలో సభ్యుడు కాని వ్యక్తి గురించి ప్రస్తావించవద్దని పలుమార్లు సూచించారు. ఎవరూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దన్నారు. ఐతే అధికార, విపక్షాల గందరగోళం తగ్గకపోవడంతో.. చైర్మన్ సభను వాయిదా వేశారు. 


ఇదిలావుంటే, మరోవైపు రాహుల్ గాంధీ చేసిన 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కనిమొళి లోక్ సభలో స్పందించారు. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని తామూ గౌరవిస్తామన్నారు. కానీ దేశంలో ఏం జరుగుతోందని ఆమె ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఉద్దేశం కూడా అటువంటిదే అయి ఉంటుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అమలు కావడం లేదు కానీ.. దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.