ఇది నిజంగా చెప్పాలంటే పదవ తరగతితో పాటు ఐటీఐ చేసిన అభ్యర్థులకు శుభవార్తే.. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా దాదాపు 90 వేల ఉద్యోగాలకు రైల్వే శాఖ నోటిఫికేషన్ ఇచ్చేసింది. అందులో టెక్నీషియన్స్‌తో పాటు పలు గ్రూప్ డి ఉద్యోగాలకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిట్టర్, క్రేన్ డ్రైవర్, బ్లాక్ స్మిత్ లాంటి ఉద్యోగాలకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హుల కాగా.. ట్రాక్ మెన్లు, గేట్ మెన్లు లాంటి గ్రూప్ సీ ఉద్యోగాలకు 18 నుండి 31 సంవత్సరాల వయసున్న వారు అర్హులు.


గ్రూప్ సీ లెవల్ 2 పోస్టులకు మార్చి 5వ తేది వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే గ్రూప్ సీ లెవల్ 1 పోస్టులకు మార్చి 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్, మే నెలల్లో ఆన్‌లైన్ విధానంలో అభ్యర్థులకు ఆర్‌ఆర్‌బీ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ 90,000 ఉద్యోగాలలో దాదాపు 62000 వేల ఉద్యోగాలను కేవలం 10వ తరగతి క్వాలికేషన్ ద్వారా మాత్రమే భర్తీ చేయడం విశేషం.ఇందులో 26000 పోస్టులను లోకో పైలట్లు, టెక్నీషియన్ల కోసం కేటాయించారు. వీరు www.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా మార్చి5వ తేది వరకు దరఖాస్తు చేయవచ్చు.