ఏసీబీ అధికారుల సోదాల్లో పెట్టెల్లో బయటపడిన కోట్ల కొద్ది నోట్ల కట్టలు!
ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ అధికారి షాహీ రామ్ మీనా నివాసంలో శనివారం సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు
జైపూర్: రాజస్తాన్‌లో అవినీతి నిరోదక శాఖ అధికారుల దాడుల్లో ఓ భారీ అవినీతి తిమింగలం చిక్కింది. జైపూర్‌లోని ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ అధికారి షాహీ రామ్ మీనా నివాసంలో శనివారం సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు రూ.2.26 కోట్ల నగదు, కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన ఇతర దస్తావేజులు, రూ. 6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు లభించినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.
జైపూర్ నడిమధ్యలో వున్న ఓ పెట్రోల్ పంపు, ఒక ఫ్లాట్, 25 దుకాణాలు, 82 భూస్థలాలకు సంబంధించిన దస్తావేజులు షాహీ రామ్ మీనా నివాసంలో లభించగా అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో అధికారి ఇంట్లో సూట్‌కేసుల్లో కోట్ల కొద్దిగా నోట్ల కట్టలు బయటపడటం అధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సోదాల్లో దొరికిన ఆస్తుల ఆధారంగా అధికారికి సంబంధించిన ఇతర నివాసాలపై సైతం దాడులు జరిపేందుకు ఏసీబీ బృందాలు వెళ్లినట్టుగా ఏఎన్ఐ వెల్లడించింది.
ఐఆర్ఎస్ అధికారి అయిన షాహీ రామ్ మీనా ప్రస్తుతం రాజస్తాన్‌లోని కోటాలో నార్కోటిక్స్ విభాగం డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.