రాజస్థాన్ సంక్షోభం ( Rajasthan crisis ) సమసినట్టే కన్పిస్తోంది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ ( Sachin pilot ) తో కాంగ్రెస్ అధిష్టానం జరిపిన చర్చలు సఫలీకృతమైనట్టుగా తెలుస్తోంది. సచిన్ పైలట్ వ్యాఖ్యలే దీనికి కారణం. ఐదేళ్ల కోసం కష్టపడి ప్రభుత్వం ఏర్పరిచామని సచిన్ వ్యాఖ్యానించడమే  దీనికి కారణం. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తన వర్గ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అహ్మద్ పటేల్, రాహుల్ గాందీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధిష్టానం ముందు కొన్ని షరతుల్ని కూడా ఉంచారు. తాము ప్రస్తావించిన డిమాండ్లు, పాలనలో సమస్యల్ని కాంగ్రెస్ అధిష్టానం విన్నదని సచిన్ పైలట్ చెప్పారు. ముగ్గురు సభ్యుల కమిటీని కాంగ్రెస్ అధిష్టానం ఏర్పర్చడం శుభ పరిణామమని సచిన్ చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నానన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్ష్యలకు తావులేదన్నారు. అందరూ సంయమనం పాటించాలని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఐదేళ్ల కోసం తామంతా కష్టపడి ప్రభుత్వాన్ని ఏర్పరిచామని సచిన్ చెప్పడం ఆసక్తి కల్గించే పరిణామం.