బీజేపీకి త్రిపుల్ తలాక్ ఇచ్చిన రాజస్థాన్ : శత్రుఘ్ను సిన్హా
సొంత పార్టీకి చురకలు పెట్టిన బీజేపీ ఎంపీ : శత్రుఘ్ను సిన్హా
కేంద్రంలో అధికారంలో వున్న సొంత పార్టీని విమర్శించడానికి అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు ప్రముఖ సినీనటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్ను సిన్హా. బీహార్‌లోని పాట్నా సాహెబ్ లోక్‌సభ నుంచి ఎంపీగా ఎన్నికైన శత్రుఘ్ను సిన్హా మొదటి నుంచి పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందడంపై తనదైన స్టైల్లో స్పందించిన శత్రుఘ్ను సిన్హా.. బీజేపీకి త్రిపుల్ తలాక్ ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించింది అంటూ సొంత పార్టీపైనే సెటైర్లు వేశారు.
రాజస్థాన్‌లోని అజ్మేర్, అల్వార్, మండల్‌ఘర్ లాంటి మూడు స్థానాలకి జరిగిన మూడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించి రాజస్థాన్ బీజేపీకి త్రిపుల్ తలాక్ ఇచ్చిందని సొంత పార్టీనే ఇరుకున పడేసే విధంగా చురకలు అంటించారు. అంతటితో ఊరుకోని ఆయన.. ఆయా చోట్ల బీజేపీ ప్రత్యర్థుల చేతిలో భారీ తేడాతో ఓడిపోయిన వైనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. శుక్రవారం ట్విటర్ ద్వారా ఈ త్రిపుల్ తలాక్ వ్యాఖ్యలు చేసిన శత్రుఘ్ను సిన్హా.. ఇకనైనా ఆలస్యం చేయకుండా పార్టీ మేలుకోకపోతే జనం పార్టీకి టాటా, బైబై చెబుతారని నేరుగానే పార్టీని హెచ్చరించారు.