ఈ రోజు రాజస్థాన్‌లో ఓ చిత్రమైన సంఘటన జరిగింది. ఓ మంత్రి ఇంటికి వెళ్లిన మరో మంత్రి అనుకోకుండా.. తన తోటి మంత్రి పైనే చేయి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని శిఖర్‌ జిల్లా ఖండేలా ప్రాంతంలో సర్కారీ టీచర్ల ట్రాన్స్‌ఫర్ల విషయంలో అవకతవకలు జరిగాయని పలు ఆరోపణలు రావడంతో ఆ ప్రాంత ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి  బన్షీధర్‌ బజియా ఆగ్రహానికి లోనయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఆ విషయం మాట్లాడేందుకు ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న విద్యాశాఖ మంత్రి దేవ్నానీ ఇంటికి వెళ్లారు. తొలుత చర్చలతో సాగిన మాటామంతీ ఆ తర్వాత వాగ్వివాదాలకు వైపు మళ్లింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మంత్రి బజియా, తన తోటి మంత్రి దేవ్నానీ చెంప చెల్లుమనిపించారని వార్తలు వచ్చాయి. అనుకోని ఈ పరిణామానికి అక్కడున్న వారందరూ హతాశులయ్యారని కూడా పలు పత్రికలు రాశాయి. 


అయితే ఈ సంఘటన మరింత వివాదాస్పదంగా మారకమునుపే ఇరువురు మంత్రులను పిలిపించి రాష్ట్ర భాజపా ఇన్‌ఛార్జ్‌ అవినాశ్‌ రాయ్‌ మాట్లాడారని సమాచారం. కాగా ఈ వార్తలను బజియా తోసిపుచ్చారు. అలాంటి ఘటన ఏమీ జరగలేదని చెప్పారు.


కాగా ఇద్దరు బీజేపీ మంత్రుల మధ్య తలెత్తిన ఈ వివాదం ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలకు మాత్రం చెప్పుకోదగ్గ కారణంగానే పరిణమించింది. సచిన్ పైలట్ లాంటి కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ నాయకుల నిజ స్వరూపమేంటో ప్రజలు తెలుసుకోవాలని హితవు పలికారు.