రాజస్థాన్‌లోని చిత్తోడ్ ఘడ్ ప్రాంతంలో తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన వ్యక్తిపై పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది ఓ యువతి. అయితే ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోమని సాటి గ్రామస్తులే ఆమెను కోరారు. ఆ గ్రామపెద్దలు కూడా ఫిర్యాదును వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని.. సామాజిక బహిష్కరణను ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే రూ.11 వేలు జరిమానా కట్టాల్సిందిగా కూడా ఆదేశించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఈ ఘటనలో స్వయానా గ్రామ పంచాయితీ సభ్యులే నిందితుడికి అండగా నిలబడడం గమనార్హం. అయినా ఆ యువతి కేసు వాపసు తీసుకోలేదు. తనకు రక్షణ కల్పించమని పోలీసులను కోరింది. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని రాజస్థాన్ మహిళా కమీషను కూడా పోలీసులను ఆదేశించింది. 


తనపై అత్యాచారం చేయడమే కాకుండా.. ఆ ఘటనను వీడియో తీసి బెదిరిస్తున్నారని.. కేసును వాపసు తీసుకోకపోతే వాటిని బహిర్గతం చేస్తామని అంటున్నారని బాధితురాలు వాపోయింది. గ్రామపెద్దలు తమ కుటుంబంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఎలాంటి సహాయ సహకారాలు కూడా అందించడం లేదని.. గ్రామాన్ని విడిచి వెళ్లిపోమని ఒత్తిడి తెస్తున్నారని ఆమె తెలిపింది. ప్రస్తుతం తమ కుటుంబాన్ని గ్రామస్తులు పూర్తిగా వెలివేశారని ఆమె తెలిపింది