చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు రజినీకాంత్‌కే ఎక్కువని కమల్ హాసన్ సోదరుడు చారుహాసన్‌ అభిప్రాయపడ్డారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడు తదుపరి సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. శనివారం ఆయన ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు రజనీతో పోల్చుకుంటే కమల్‌కు చాలా తక్కువగా ఉన్నాయని, కమల్ హాసన్‌ను మంచి నటుడిగా చూస్తారే గానీ రాజకీయపరంగా మాత్రం ఆ స్థాయి ఉండదని అభిప్రాయపడ్డారు. అటు రజనీకాంత్‌ను కన్నడిగుడని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారికి ఆయన పరిపూర్ణ విజయంతో సమాధానం లభిస్తుందన్నారు. చారుహాసన్‌ మొదటి నుంచీ రజనీకాంత్ కే మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.