తమిళ రాజకీయ దిగ్గజం కరుణానిధి అస్తమించడంతో ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించేందుకు ఎందరో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు నిన్నటి నుంచి చెన్నైలోని గోపాలపురంలో ఉన్న కరుణానిధి నివాసానికి క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న మంగళవారం రాత్రి 10 గంటలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడకు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం కరుణానిధికి నివాళి అర్పించేందుకని గోపాలపురంలో ఉన్న కరుణ నివాసానికి వచ్చారు. అయితే, అప్పటికే తమ ప్రియతమ నేత మృతిచెందారనే వార్త తెలుసుకుని ఆయన్ని కడసారి చూసుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడకు తరలివచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ భద్రత మధ్య గోపాలపురం చేరుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కట్టుదిట్టమైన భద్రత మధ్య కరుణానిధి నివాసంలోకి వెళ్లి ఆయన పార్థవదేహానికి నివాళి అర్పించి ఆయన కుటుంబసభ్యులైన ఎం.కే. స్టాలిన్, కనిమొళి, అళగిరిలను ఓదార్చి వారికి తన సానుభూతి తెలిపారు. అయితే అదే సమయంలో సాదాసీదాగా గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి చేరుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కి మాత్రం లోపలికి వెళ్లేందుకు వీలు లేకపోయిందని తెలుస్తోంది.  


అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో వేచివున్న జనం మధ్యలోంచి లోపలికి వెళ్లలేక, చివరకు ఆయన అక్కడి నుంచే తిరిగి వెనక్కి వెళ్లిపోయినట్టు సమాచారం. దీంతో మరుసటి రోజైన బుధవారం తన భార్య లత, కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్ లతో కలిసి రాజాజీహాల్ వద్దకు చేరుకున్న రజినీకాంత్ అక్కడే కరుణానిధికి నివాళి అర్పించారు.