తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన అభిమానులతో భేటీ అయ్యారు. 'మీట్ అండ్ గ్రీట్' పేరిట ఆరు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో భాగంగా ఈరోజు ఉదయం రజినీకాంత్ తన అభిమానులతో భేటీ అయ్యారు. చెన్నైలోని శ్రీ రాఘవేంద్ర కళ్యాణ మండపంలో నేటి నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఆరు రోజులపాటు రజినీకాంత్ అభిమానులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా నేడు జరిగిన ప్రారంభోత్సవ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులని ఉద్దేశించి ప్రసంగించిన సూపర్ స్టార్.. ఈ డిసెంబర్ 31వ తేదీన జరగనున్న చివరి సమావేశంలో తన రాజకీయ ప్రవేశంపై ఓ ప్రకటన చేయనున్నట్టు తెలిపారు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, సూపర్ స్టార్ సన్నిహితమిత్రుడు తమిళరువి మణియన్ వారం రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ.. "డిసెంబర్ 26వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో రజినీకాంత్ ఎప్పుడైనా రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి" అని అన్నారు. ఒకసారి రజినీకాంత్ ప్రకటన చేశారంటే, ఆ తర్వాత అతడి రాజకీయ ప్రవేశంపై ఎవ్వరూ, ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని తమిళరువి మణియన్ అభిప్రాయపడ్డారు.


తన రాజకీయ ప్రవేశం అంశంపై అభిమానులతో కలిసి సమాలోచనలు జరుపుతున్నట్టుగా ఈ ఏడాది ఆగస్టులో సూపర్ స్టార్ మొదటిసారిగా ప్రకటించారు. సూపర్ స్టార్ ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో.. అప్పటి నుంచి అతడి రాజకీయ రంగ ప్రవేశంపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని వుంది. కేవలం అభిమానుల్లోనే కాకుండా తమిళతంబీలు, తమిళనాట రాజకీయ వర్గాలు రజినీకాంత్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తమిళనాట భారీ అభిమాన బలగం కలిగిన రజినీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే, కచ్చితంగా ఇతర రాజకీయ పార్టీలకి కాస్త గడ్డు పరిస్థితి ఏర్పడక తప్పదని అక్కడి రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్న నేపథ్యంలో సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది.