బీజేపీ నేతలు రామ మందిరాన్ని నిర్మిస్తారన్నది.. ఒక అబద్ధమని మా అనుమానం: శివసేన
కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీ నేతలు రామ మందిరం విషయం గురించి మాట్లాడతారని.. మామూలు సందర్భాల్లో వారు ఆ విషయం గురించి మాట్లాడడానికి కూడా భయపడతారని థాక్రే ఎద్దేవా చేశారు.
"బీజేపీ నేతలు రామ మందిరాన్ని నిర్మిస్తారన్నది ఒక జుమ్లా (అబద్ధపు మాట) అని మా అనుమానం. వారు ఎన్నికలలో గెలిస్తే అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తారన్నారు. కానీ అది నిజమైన మాటేనా. కాదు కదా..! అలాగే బీజేపీ నేతలు రామ మందిరం విషయంలోనూ ప్రవర్తించవచ్చు. మేం ఎందుకు ఈ మాట అంటున్నామంటే.. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలన్నదే మా అభిమతం కాబట్టి" అన్నారు శివసేన నేత ఉద్ధవ్ థాక్రే. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీ నేతలు రామ మందిరం విషయం గురించి మాట్లాడతారని.. మామూలు సందర్భాల్లో వారు ఆ విషయం గురించి మాట్లాడడానికి కూడా భయపడతారని థాక్రే ఎద్దేవా చేశారు.
ఈ నెల 25వ తేదిన థాక్రే అయోధ్యను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లడుతూ, రామ మందిర నిర్మాణ విషయం అనేది కోర్టు విషయానికి పరిమితం కాదని.. ఒక సెంటిమెంట్‌కు, జాతీయ గౌరవానికి సంబంధించిన అంశమని.. తాము ఈ విషయంలో ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు.
"మా పార్టీ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. కానీ మేము రామ మందిర నిర్మాణం కోసం ఢిల్లీ వచ్చి కూడా పోరాడగలం" అని రౌత్ తెలిపారు. అయోధ్యను ఈ నెల 25వ తేదిన థాక్రే సందర్శిస్తారని.. ఈ సందర్భంగా ఆయన లక్ష్మణ్ కిలాలో జరిగే సంప్రదాయ కార్యక్రమాలలో, వేడుకలలో పాలు పంచుకుంటారని.. సరయు ఆర్తికి కూడా హాజరవుతారని బీజేపీ ప్రతినిధి రౌత్ తెలిపారు. నవంబవరు 25వ తేదిన అయోధ్యలో జరిగే జన సంవాద్ కార్యక్రమంలో కూడా థాక్రే పాల్గొని.. ఆ తర్వాత రాముని విగ్రహానికి పూలమాలలు వేస్తారని రౌత్ తెలిపారు.