యూఐడిఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఛైర్మన్ మరియు ఏపీ రాష్ట్ర ఐటి సలహాదారు జె.సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే వెబ్ సైట్లలో ఆధార్ కార్డులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉండకూడదని తెలిపారు. అలాంటి డేటా ఉంటే వెంటనే తొలిగించాలని కూడా ఆయన ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్నే విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశానికి హాజరైన సత్యనారాయణ మాట్లాడుతూ "ఆధార్ యాక్ట్ 2016 ప్రకారం ఏ వెబ్‌సైట్‌లో కూడా ఆధార్ వివరాలు ఉండకూడదు. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్లలో ఆ డేటా ఉన్నట్లు తెలుస్తోంది. కనుక, ఆ శాఖలు అన్నీ ఇప్పటికైనా ఆ డేటాని తొలిగించాల్సిందే. అలాగే భవిష్యత్తులో కూడా ఆ డేటా వెబ్ సైట్లలో లభ్యం కాకుండా జాగ్రత్త పడాలి" అని తెలిపారు


ఆధార్ యాక్ట్, 2016 ప్రకారం ఎవరైనా ఇతరుల ఆధార్ వివరాలను బహిర్గతం చేయడం కూడా నేరమే అని జె.సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే పలువురు సైబర్ సెక్యూరిటీ నిపుణులు సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రభుత్వ వెబ్ సైట్లలో విరివిగా ఆధార్ నెంబర్లు లభిస్తున్నాయని తెలిపిన విషయం తెలిసిందే. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద నమోదైన 87 లక్షల మంది కార్మికుల వివరాలు కూడా ప్రభుత్వ వెబ్ సైట్లలో నమోదయ్యాయన్న విషయం తెలుస్తోంది.


అలాగే పలు రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్లలో ప్రభుత్వ పథకాలు పొందుతున్న మహిళలు, ఇళ్ల పట్టాదారులకు సంబంధించిన ఆధార్ వివరాలు కూడా ఉన్నాయని.. వాటిని కూడా యాక్ట్ ప్రకారం తొలిగించాల్సి ఉంటుంది అని ఛైర్మన్ తెలిపారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ విషయంలో ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ సహాయం తీసుకోవాలని తెలిపారు