రోహింగ్యాలు, బంగ్లాదేశీ వలసదారులని కాల్చిచంపాల్సిందేనన్న బీజేపీ నేత!
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులు తమంతట తాముగా దేశం విడిచిపెట్టి వెళ్లకపోతే, వారిని కాల్చిచంపాల్సిందేనని అన్నారు రాజా సింగ్. రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులను కాల్చిచంపితేనే దేశం సురక్షితంగా ఉంటుందని రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇప్పటికే అస్సాం ప్రభుత్వం విడుదల చేసిన పౌరుల జాతీయ పట్టిక, రోహింగ్యాల విషయమై పార్లమెంట్‌లో అధికారపక్షమైన బీజేపీ, ప్రతిపక్షాలు వాగ్వీవాదాలకు దిగుతున్న తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు తీవ్ర చర్చనియాంశమయ్యాయి.
ఇదిలావుంటే, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారుల విషయంలో ప్రతిపక్షం అనవసరంగా లేనిపోని రాద్ధాంతం చేస్తోంది అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయపడగా.. ప్రతిపక్షం వలసదారుల కొమ్ముకాస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఏ మలుపు తిరగనున్నాయో వేచిచూడాల్సిందే మరి!