పరీక్షల వాయిదా కోసం విద్యార్థి హత్య
పదకొండవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి, తన స్కూలులో పరీక్షలను వాయిదా వేయించడం కోసం తన తోటి విద్యార్థిని మట్టుబెట్టాడని ఢిల్లీ పోలీసు వర్గాలు మీడియాకి తెలిపాయి. సీబీఐ ఎంక్వయిరీ వలన ఈ విషయం తేటతెల్లమయ్యింది . అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి పేరును బహిర్గతం చేయలేదు.
అయితే అదే విద్యార్థి ప్రవర్తనకు సంబంధించి అదే స్కూలులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలోనే అశ్లీల చిత్రాలు చూడడం... తోటి విద్యార్థులతో గొడవపడడం ఆ విద్యార్థి చేస్తుంటాడని.. తనపై ఫిర్యాదులు ఉన్నాయి. ప్రద్యుమ్న టాగూర్ అనే విద్యార్థి ఢిల్లీలోని ర్యాన్ పాఠశాలలో మరణించిన రోజు, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి ఒక పొడవాటి కత్తిని పాఠశాలకు తీసుకొచ్చినట్లు కొందరు విద్యార్థులు సాక్ష్యం చెప్పారు.
త్వరలో జరగబోయే పాఠశాల పరీక్షలను వాయిదా వేయించడం కోసం ఆ రోజు తాను ఓ గొప్ప పని చేయబోతున్నానని తను తోటి విద్యార్థులతో చెప్పినట్లు విచారణలో తేలింది. అయితే అదే విద్యార్థి తండ్రి చెబుతున్న విషయాలు వేరేగా ఉన్నాయి.
తన బిడ్డకు ఎలాంటి పాపమూ తెలియదని.. తాను ఈ హత్య చేసి ఉండడని, సీబీఐ అధికారులే బలవంతంగా అతన్ని కేసులో ఇరికించి పేపర్లపై సంతకాలు పెట్టించుకొన్నారని ఆయన వాపోతున్నాడు.
సెప్టెంబరు 8 తేదీన ఢిల్లీలో ఓ ప్రముఖ పాఠశాలలో జరగిన ప్రద్యుమ్న టాగూర్ అనే విద్యార్థి హత్య చాలా సంచలనం సృష్టించింది. విద్యార్థి గొంతుకోసి హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టు తెలిపింది. విద్యార్థులలో నేరప్రవృత్తికి మితిమీరిపోతుందనడానికి ఈ సంఘటనే సాక్ష్యమని.. అందుకు పాఠశాలలు కూడా బాధ్యత వహించాలని ఇప్పటికే కొన్ని ప్రజాసంఘాలు ఇడిమాండ్ చేశాయి.
ప్రద్యుమ్న టాగూర్ హత్య కేసులో తొలుత స్కూల్ బస్సు డ్రైవరును అనుమానించిన సీబీఐ విచారణాధికారులు, ఆ తర్వాత హత్య జరిగిందని తొలి సమాచారం అందించిన విద్యార్థిని కూడా ఎంక్వయిరీ చేశారు. ఆ తర్వాత ఆ హత్య ఆ విద్యార్థే చేసినట్లు నిర్థారించి బుధవారం జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు.