Green India Challenge: ఐదోవిడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ప్రారంభించనున్న సద్గురు జగ్గీ వాసుదేవ్
Green India Challenge: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమస్ఫూర్తితో కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు విడతలు విజయవంతంగా కొనసాగిన ఈ కార్యక్రమం ఐదో విడతకు సిద్ధమవుతోంది. ఈ బృహత్కార్యానికి తానుసైతం అని ముందుకొచ్చారు ప్రముఖ ఆద్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్.
Green India Challenge: ప్రకృతికి పచ్చనిహారం తొడుగుతూ ఐదో ఏడాదిలోకి ఎంటరైంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. గత నాలుగేళ్లుగా కోట్లాది మొక్కలను నాటిన స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ఈ మహాయజ్ఞానికి సిద్ధమవుతున్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్. ఐదో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఈ నెల 16 న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. వానాకాలం సీజన్‌తో పాటు మొక్కలునాటే ఈ ఉద్యమం కూడా మొదలుకానుంది.
పర్యావరణ హితం, దేశవ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు ఎంపీ సంతోష్‌కుమార్. అలాగే పుడమిని రక్షించుకుందాం, నేలతల్లిని క్షీణించకుండా కాపాడుకుందాం అంటూ సేవ్ సాయిల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు సద్గురు జగ్గీ వాసుదేవ్. సేవ్ సాయిల్ అంటూ ప్రపంచ యాత్ర చేపట్టారు.ఈ యాత్ర ఈ నెల 15 న హైదరాబాద్ చేరుకుంటుంది. 16 న కర్నూలు మీదుగా బెంగళూరు వెళ్తుంది. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్. మొక్కలు నాటే ఈ మహత్కార్యంలో తాను కూడా పాల్గొనేందుకు సుముఖత తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 16 న శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌రోడ్‌లో గొల్లూరు ఫారెస్ట్ పార్క్‌లో ఎంపీ సంతోష్‌కుమార్ తో కలిసి మొక్కలు నాటతారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0 ను లాంఛనంగా ప్రారంభిస్తారు సద్గురు జగ్గీ వాసుదేవ్. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబిత, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సైతం పాల్గొని మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమం కోసం పలువురు ప్రముఖులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రేమికులు, సద్గురు మార్గాన్ని అనుసరిస్తున్న అభిమానులు భారీగా తరలిరానున్నారు. ఒకేసారి పదివేల మొక్కలను నాటుతారు. ఇలా పర్యావరణ సంరక్షణ కోసం గ్రీన్‌ఇండియా ఛాలెంజ్, సేవ్ సాయిల్ స్వచ్ఛంద ఉద్యమాలు ఒక్కటయ్యాయి. పదివేల మొక్కలు నాటే మహా కార్యక్రమాన్ని తెలంగాణ అటవీశాఖ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో కలిసి నిర్వహిస్తోంది. క్షీణించిన అటవీ ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టింది.
సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో 2018 లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్. ప్రతిఒక్కరూ మూడు మొక్కలు నాటు మరో ముగ్గుర్ని మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసరాలనే స్ఫూర్తితో దీన్ని ప్రారంభించారు. దీనికి అనతికాలంలోనే అద్భుతమైన స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా ఉద్యమరూపం దాల్చింది. అనేక రంగాల ప్రముఖులు ఇందులో పాల్గొని మొక్కలు నాటారు. దేశం నలువైపులా విస్తరించిన ఈ కార్యక్రమం హరిత స్ఫూర్తితో కొనసాగుతోంది. గత నాలుగేళ్లలో గిన్నిస్ రికార్డులతో పాటు ముక్కోటి వృక్షార్చన, ఊరూరా జమ్మిచెట్టులాంటి వినూత్న కార్యక్రమంలతో కోట్లాది మొక్కలు నాటారు. అటవీ ప్రాంతాలను దత్తత తీసుకొని అక్కడ పచ్చదనం పెంచేలా చేశారు. పుట్టినరోజుతో పాటు ఏ ఇంట ఎలాంటి వేడుక జరిగినా మొక్కనాటి పండగ చేసుకోవటం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ఈ ఐదవ విడతలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మరింతగా విస్తరిస్తామని... దేశవ్యాప్తంగా విభిన్న వర్గాల భాగస్వామ్యం పెంచేందుకు కృషిచేస్తామన్నారు ఎంపీ సంతోష్‌కుమార్
Also read : Jagannath Rath Yatra 2022: పూరీ జగన్నాథ రథయాత్ర ఎప్పుడు? దాని విశిష్టత ఏంటి?
Also read : Diabetes: ఇన్సులిన్ మొక్క వల్ల డయాబెటిక్ పేషెంట్లకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి