Third Front: 2024 ఎన్నికల నాటికి దేశంలో మూడవ కూటమి ఏర్పాటు కానుందా
Third Front: దేశంలో 2024 ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమౌతున్నాయి. ఎన్డీయే, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా మూడవ కూటమి సూచనలు కన్పిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ దిశగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
Third Front: వచ్చే 2024 ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కాకుండా మరో కూటమి ఏర్పడవచ్చని తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో మూడవ కూటమికి రంగం సిద్ధమౌతోంది. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
2024 లోక్‌సభ ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం కూడా లేదు. 2014,2019లో వరుసగా రెండు పర్యాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మూడోసారి అధికారం కోసం తహతహలాడుతోంది. మరోవైపు 2004,2009లో అధికారం చెలాయించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఈసారి గద్దెనెక్కేందుకు ప్రయత్నిస్తోంది. అవసరమైతే మరిన్ని విపక్షాల్ని కలుపుకుని ముందుకెళ్లేందుకు యోచిస్తోంది. ఈ క్రమంలో మూడవ ప్రత్యామ్నాయం చర్చనీయాంశమౌతోంది. మూడవ కూటమి ఏర్పడుతుందా లేదా అనేది తెలియదు కానీ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఓ వైపు కేజ్రీవాల్, మరోవైపు కేసీఆర్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా యూపీ మాజీ ముఖ్యమంత్రి సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యల్ని బట్టి మూడవ కూటమి తప్పకుండా ఏర్పడుతుందని తెలుస్తోంది.
లోక్‌సభ 2024 ఎన్నికలకు 10 నెలల ముందే మూడవ కూటమిపై స్పష్టమైన సంకేతాలిచ్చారు అఖిలేష్ యాదవ్. ఓ న్యూస్ ఛానెల్‌లో నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. మూడవ కూటమి అనవచ్చు లేదా మూడవ ప్రత్యామ్నాయం పేరు ఏదైనా కావచ్చు..ప్రతిపక్షాలన్నీ కలిసి ఈసారి ఏదో ఒకటి చేయాల్సిందేనని అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నారు. లఖీమ్‌పూర్ ఖీరీలో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటైన రెండ్రోజుల శిక్షణా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
2024 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే పార్టీని, కార్యకర్తలను బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ బలోపేతం చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం పతాక స్థాయికి చేరుకున్నా ఇవన్నీ పక్కనపెట్టి టిఫిన్‌పై చర్చ అంటూ బీజేపీ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తోందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. పిల్లలకు కనీసం భోజనం కూడా పెట్టని వారినుంచి పిల్లల భవిష్యత్ గురించి ఏం ఆశించగలమన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ 9 ఏళ్ల పాలనకు గుర్తుగా జన సంపర్క్ కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ టిఫిన్‌పై చర్చను ప్రారంభించింది.
మరోవైపు ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కూడా అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. త్రిపుల్ ఇంజన్ కలలు చూపిస్తూ వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో మూడు ఇంజన్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయంటూ ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రం నుంచే కాకుండా దేశం నుంచి కూడా పోతుందని అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మూడవ ప్రత్యామ్నాయం లేదా కూటమి అవకాశాలపై, సాధ్యాసాధ్యాలపై విపులంగా చర్చించారు.
Also read: Rs 1.6 Crore Salary Job: ఫైనల్ ఇయర్ స్టూడెంట్‌కి రూ. 1.6 కోట్ల శాలరీతో జాబ్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook