మోడీ కన్నా రాహుల్ బెటర్ : శివసేన ఎంపీ
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోడీ హవాకు చుక్కెదురు మొదలైందని.. రాహుల్ గాంధీ లాంటి వారు ఈ సమయంలో అధికారానికి అర్హులేనని ఆయన తెలిపారు. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి ప్రకటన వెలువడిన రెండవ రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గుజరాత్ ప్రజలు మోడీ హయంలో వచ్చిన జీఎస్టీ విధానంపై విముఖతతో ఉన్నారని.. ఆ విముఖతే బీజేపీకి శాపంగా పరిణమించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాహుల్‌ని చాలామంది "పప్పు" అని పిలుస్తుంటారని, కాకపోతే ఓటర్లకు ఎవరికైనా సరే "పప్పు" బిరుదు ఇవ్వగల సమర్థత ఉందని..ఈ సారి ఆ బిరుదు బీజేపీ నేతలకు దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అధికార పార్టీపై ఛలోక్తులు విసిరారు. శివసేన అధికార బీజేపీ పార్టీకి జాతీయ స్థాయిలో మద్దతిస్తున్నా, ఎప్పటికప్పుడు అదే పార్టీకి కౌంటర్ కూడా ఇస్తోంది. శివసేన పార్టీ పత్రిక "సామ్నా"లో మోడీ పాలనపై విరుచుకుపడుతోంది. ఇటీవలే శివసేన నేత ఉద్దవ్ థాక్రేని గుజరాత్ పటేదార్ పోరాట సమితి నాయకుడు హార్దిక్ పటేల్ కలిసినప్పుడు, ఆ పోరాటానికి మద్దతు ప్రకటించింది శివసేన. ప్రస్తుతం మోడీని విమర్శిస్తున్నా, శివసేన ఎంపీ రౌత్ 2015 ఎన్నికలలో "100 మంది రాహుల్ గాంధీలు కూడా మోడీ పవర్ ముందు బలాదూర్" అని చెప్పడం విశేషం.