ఆ ప్రభుత్వ పాఠశాలలో 200 మందికిపైగా విద్యార్థిని, విద్యార్థులకు ఒక్కరే టీచర్ పాఠాలు చెబుతున్నారు. తాను చెప్పాల్సిన అసలు సబ్జెక్ట్ సంస్కృతం అయినా.. సైన్స్, మ్యాథమేటిక్స్ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకుని మరీ చెప్పాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తోన్న ఆ టీచర్‌కి తాను ఎదుర్కొంటున్న పని ఒత్తిడిని తల్చుకుంటే ఏడవడం ఒక్కటే తక్కువ. ఇంతకీ ఆ బడి ఎక్కడుంది ? ఆ టీచర్ ఎవరు అనే వివరాలు తెలుసుకోవాలంటే ఇదిగో ఈ టీచర్ గోడు ఏంటో తెలుసుకోవాల్సిందే. హర్యానాలోని గురుగ్రామ్‌కి సమీపంలోని అల్వాల్‌పూర్‌లో ఉన్న నూహ్‌ ప్రభుత్వ పాఠశాలకు ఏడాది క్రితం సంస్కృతం టీచర్‌గా బదిలీపై వచ్చిన నవాబ్ ఖాన్.. ఆ తర్వాత అదే బడిలో పిల్లలకు సైన్స్, గణిత శాస్త్రాలు కూడా చెప్పాల్సి వస్తుందని అప్పట్లో ఊహించలేదంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాను బదిలీపై వచ్చినప్పుడు ఆ బడిలో మరో నలుగురు టీచర్లు ఉండేవారు. కానీ గత పది నెలల కాలంలో ఆ నలుగురు బదిలీలపై అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాతి నుంచి తానొక్కడే అన్నీ అయి ఆ బడిని నిర్వహించాల్సి వస్తోందని నవాబ్ ఖాన్ ఓ జాతీయ దినపత్రికకు తన గోడు వెళ్లబోసుకున్నారు. 


"మొదటి నుంచి సంస్కృతం తప్పు మరొకటి తెలియని నేను ఇప్పుడు సైన్స్, మ్యాథమేటిక్స్ సబ్జెక్ట్స్ నేర్చుకోవాల్సి వస్తోంది. ఎప్పుడూ చూడని పుస్తకాలను పట్టుకుని కుస్తీ పట్టాల్సి వస్తోంది. పిల్లలకన్నా ముందు నేను నేర్చుకుని, ఆ తర్వాత వారికి చెప్పాల్సి వస్తోంది. ఇదే కాకుండా బడిలో చేరే విద్యార్థులు, బడి నుంచి వెళ్లిపోయే విద్యార్థుల వివరాలు నమోదు చేసుకోవడం వంటి పరిపాలనా వ్యవహారాలు సైతం చూసుకోవాల్సి వస్తోంది. దీంతో చాలా సందర్భాల్లో చదువును నిర్లక్ష్యం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది" అని నవాబ్ ఖాన్ తన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు. 


"ఈ బడికి టీచర్లు కావాలి అని ఎన్నిసార్లు విద్యాశాఖకు మొరపెట్టుకున్నా.. వాళ్లు నా విజ్ఞప్తిని పెడచెవిన పెడుతూ వచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెట్టాలన్నా కష్టంగానే ఉంది. మరీ తప్పని పరిస్థితి తలెత్తితే, తాను విద్యాశాఖ అధికారులకు సమాచారం అందిస్తే, వారు మరో పాఠశాల నుంచి తాత్కాలికంగా ఓ టీచర్‌ని ఇక్కడకు పంపిస్తారు" అని నవాబ్ ఖాన్ ఆవేదన వ్యక్తంచేశారు.


ఎట్టకేలకు ఈ బడి కష్టాలకు మోక్షం లభించింది. రానున్న వారం రోజుల్లో ముగ్గురు ప్రాథమిక పాఠశాల టీచర్లు ఈ బడికి డిప్యూటేషన్‌పై రానున్నారనే వార్త అందరికన్నా ఎక్కువ నవాబ్ ఖాన్ కళ్లలోనే కనబడుతోంది.