న్యూఢిల్లీ: రుణగ్రహీతలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఓ చేదు వార్త వినిపించింది. ఫండ్స్ ఆధారిత రుణాలపై వసూలు చేసే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్), బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (బీపీఎల్ఆర్), బేస్ రేట్లను 0.05% మేర పెంచుతున్నట్టు ఇవాళ ఎస్బీఐ ప్రకటించింది. జీ బిజినెస్ న్యూస్ కథనం ప్రకారం ఎస్బీఐ రుణాలపై బెంచ్‌మార్క్ వడ్డీ ధరలను పెంచిన కారణంగా ఇకపై ఎస్బీఐ రుణాలకు సంబంధించిన ఈఎంఐ భారం మరింత ప్రియం కానున్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదాహరణకు పెరిగిన ఎంసీఎల్ఆర్ రేటు విషయానికొస్తే, ఇప్పటివరకు ఏడాది కాల పరిమితి కలిగిన రుణాలపై 8.50% గా వున్న ఎంసీఎల్ఆర్ రేటు ఇకపై 8.55% కానుంది. అలాగే రెండేళ్ల కాల పరిమితి కలిగిన రుణాల ఎంసీఎల్ఆర్ రేటు ఇప్పటివరకు 8.60% కాగా ఇకపై అది 8.65%కి చేరుకోనుంది. ఇక మూడేళ్ల కాల పరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ ఇప్పటివరకు 8.70%గా వుండగా ఇకపై 8.75% కానుంది. హౌజింగ్ లోన్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ వంటి రుణాలపై వడ్డీ ధరలను ఖరారు చేయడానికి బ్యాంకులు అనుసరించే పద్ధతిలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ ఎంసీఎల్ఆర్‌ ఉపయోగపడుతుంది. 2016 నుంచి బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ పద్ధతిని అనుసరిస్తున్నాయి. 


ఇక బీపీఎల్ఆర్ రేటు విషయానికొస్తే, ఇప్పటివరకు అమలులో వున్న బీపీఎల్ఆర్ రేటు ప్రకారం ఎస్బీఐ 13.75% వడ్డీ రేటును చార్జ్ చేస్తుండగా ఇకపై వడ్డీ రేటు 13.80% కానుంది. 2013 నుంచి బ్యాంకులు ఈ బీపీఎల్ఆర్ పద్ధతిని అనుసరిస్తున్నాయి.