భారతీయ స్టేట్ బ్యాంక్ తమ వద్ద సేవింగ్ ఎకౌంట్ కలిగిన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు బ్యాంక్ ఎకౌంట్ కలిగివున్న హోమ్ బ్రాంచ్‌లో కాకుండా ఇతర శాఖల్లో నగదు జమ చేయాలనుకునేవారికి రోజుకు రూ.25,000 వరకు మాత్రమే పరిమితి ఉండేది. అయితే, ఇకపై ఆ పరిమితిని ఎత్తేస్తున్నట్టు ఎస్బీఐ ఇటీవల ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఇకపై సేవింగ్స్ ఖాతాదారులు దేశవ్యాప్తంగా ఏ శాఖలోనైనా, ఎంత మొత్తంలోనైనా నగదు జమ చేసే వెలుసుబాటు కల్పిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. వివిధ పనులపై నిత్యం ప్రయాణాలు సాగిస్తూ రోజుకొక చోట ఉండేవారికి కానీ లేదా హోమ్ బ్రాంచ్ ఒక చోట ఉండి, ఉపాధి నిమిత్తం మరోచోట ఉండాల్సి వచ్చే వారికి ఒక విధంగా ఈ వెసులుబాటు ఉపశమనాన్ని ఇవ్వనుంది. హోం బ్రాంచ్‌కి దూరంగా ఉన్న సందర్భా్ల్లో తమ ఎకౌంట్‌లో భారీ మొత్తాన్ని జమ చేయాలనుకునేవారికి కూడా ఈ వెసులుబాటు బాగా ఉపయోగపడనుంది. 



ఇదిలాఉంటే, ఎస్ఎంఈ సెగ్మెంట్ ఖాతాదారులకు మాత్రం ఇతర శాఖల్లో (నాన్-హోం బ్రాంచెస్) నగదు జమ చేయడానికి రోజుకు రూ.2 లక్షల పరిమితి అలాగే కొనసాగనున్నట్టు ఎస్బీఐ స్పష్టంచేసింది.