న్యూఢిల్లీ: ఎస్బీఐ కస్టమర్లు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకు కేవైసి డాక్యుమెంట్స్ ( KYC documents ) సమర్పించని ఖాతాదారులు ఫిబ్రవరి 28వ తేదీలోగా కేవైసీ పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ గడువు విధించింది. అప్పటికీ కేవైసీ పూర్తి చేసుకోని వినియోగదారులు ( SBI customers ) ఎవరైనా ఉంటే.. వారి ఖాతాలను బ్లాక్ చేసేందుకైనా వెనుకాడబోమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పష్టంచేసింది. ఈ మేరకు ఎస్బిఐ ఖాతాదారులకు ( SBI account holders ) వారి వారి ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్స్‌కి సందేశాలు పంపడంతో పాటు అత్యవసరంగా పబ్లిక్ నోటీసు సైతం జారీ చేసింది. 2020 ఫిబ్రవరి 28 నాటికి కెవైసిని పూర్తి చేసుకోలేకపోయిన ఖాతాదారుల ఖాతాలను ఎస్‌బిఐ బ్లాక్ చేయడం తప్ప మరో మార్గం ఉండదని ఎస్‌బిఐ ఈ పబ్లిక్ నోటీసులో పేర్కొంది. వాణిజ్యం, లావాదేవీల పరంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా పేరొందిన ఎస్బిఐ ఈసారి ఖాతాదారుల పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయించుకుంది. అందుకే ఒకవేళ మీ మొబైల్ ఫోన్‌లో మీకు అలాంటి మెసేజ్ లేదా ఇ మెయిల్ వచ్చినట్లయితే, ఇక మీరు జాగ్రత్తపడాల్సిందే. ఎందుకంటే ఇంకా మీ చేతిలో కేవలం ఓ వారం రోజులే ఉంది. 


మనీలాండరింగ్ నివారణ చట్టం- 2002, మనీలాండరింగ్ నివారణ (రికార్డుల నిర్వహణ) నిబంధనలు- 2005 ప్రకారం, భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరించి, జారీచేసిన నిబంధనల ప్రకారమే అన్ని బ్యాంకింగ్ సంస్థలు పనిచేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా, దేశంలోని  బ్యాంకులు ఏవైనా వినియోగదారులతో ఖాతా ఆధారిత సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా లేదా లావాదేవీలు చేపట్టేటప్పుడు కొన్ని కస్టమర్ గుర్తింపు విధానాలను పాటించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే అన్ని భారతీయ బ్యాంకులు తమ వినియోగదారులవు కేవైసి పూర్తి చేసుకోవాల్సిందిగా ఎప్పటికప్పుడు సూచిస్తూ వస్తున్నాయి. అలా ఖాతాదారులను అప్రమత్తం చేయడంలో విఫలమైతే, బ్యాంకులే ఆర్బీఐ నుంచి భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బ్యాంకింగ్ రంగం నిపుణులు చెబుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..