భారత ప్రధాని నరేంద్ర మోదీ దళిత వ్యతిరేకి అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన పలువురు దళిత నాయకుల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన రాహుల్ మాట్లాడుతూ " ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాల నిరోధక చట్టం కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది. మేము అందరి ఉన్నతికి పాటుపడతాం. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు ఎక్కువయ్యాయి. ఇలాంటి భారతదేశాన్ని మేము చూడాలని అనుకోవడం లేదు. మా అభిప్రాయంలో కుల, మతాలకతీతంగా అందరికీ సమాన గౌరవం, స్వాతంత్ర్యం లభించాలి. దళితులు, పేదలు, గిరిజనులు, మైనారిటీలు అందరూ ముందుకు వెళ్లాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాంటి భారత్ కోసం మేము ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాం. కానీ భారత ప్రధాని దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నట్లు నాకు తోస్తుంది. ఆయన గుండెల్లో దళితులకు చోటు లేదని అనిపించేలా ఆయన ప్రవర్తిస్తున్నారు. అందుకే దళితులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాల నిరోధక చట్టం- 1989 పునరుద్ధరించాలన్న డిమాండ్ వస్తున్న క్రమంలో ప్రభుత్వ వైఖరి ఏంటో తెలపాలి" అని రాహుల్ గాంధీ తెలిపారు. 


అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అమిత్ షా మండిపడ్డారు. "రాహుల్ జీ..! మీరు లేనిపోని కారణాలతో పార్లమెంటులో గొడవలు పెట్టడం ఎప్పుడూ మానుకుంటారో తెలపండి. ఇటీవలే ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టానికి బలం చేకూర్చేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్న విషయం మీకు తెలియంది కాదు. అయినా మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదు.


గతంలో బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్, సీతారామ్ కేసరి లాంటి దళిత నాయకుల పట్ల కాంగ్రెస్ ఎలా వ్యవహరించిందో.. వాటి మీద కూడా రాహుల్ మాట్లాడితే బాగుంటుంది. దళితులను అవమానించడమే అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పనిగా పెట్టుకుంది. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంవత్సరమే రిజర్వేషన్ల మీద వ్యతిరేకత వచ్చింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక...ఓబీసీ బిల్లుపై ఆ పార్టీ ఎలాంటి వైఖరి కూడా వెల్లడించలేదు. కానీ మోదీ సర్కారుకి ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఓబీసీ కమీషనుపై కూడా నిర్దిష్టమైన అవగాహన ఉంది" అన్నారు.