సుప్రీం కోర్టు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి వ్యతిరేకం కాదని, గత నెల 20వ తేదీన ఇచ్చిన తీర్పుని నిరసనకారులు కనీసం చదివినట్టు కూడా లేరని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా, ఎటువంటి విచారణ లేకుండానే అరెస్టులు జరగకూడదనే ఉద్దేశంతోనే ఆ తీర్పు ఇచ్చినట్టు కోర్టు స్పష్టంచేసింది. అమాయకులు జైలు పాలు కాకూడదనే ఉద్దేశంతో ఇచ్చిన తీర్పుని ఆందోళనకారులు సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లేరని అభిప్రాయపడిన కోర్టు.. కేంద్రం కోరినట్టుగా ఆ తీర్పుపై స్టే ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన కోర్టు.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం విషయంలో పునఃసమీక్ష జరపాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటున్నట్టు స్పష్టంచేసింది.


ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం విషయంలో సుప్రీం కోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ సోమవారం జరిగిన భారత్ బంద్‌‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ప్రాణనష్టం పలువురు ప్రాణాలు కోల్పోగా వేల కోట్ల ఆస్తి నష్టం సైతం సంభవించిందని కేంద్రం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే, భారత్ బంద్ సందర్భంగా చెలరేగిన హింసలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని చెప్పడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన కోర్టు.. శాంతి భద్రతల బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది కదా అంటూ అటార్నీ జనరల్ అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తంచేసింది.