సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు మేఘాలయ మాజీ గవర్నర్ ఎంఎం జాకబ్ ఈ రోజు ఉదయం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. 90 సంవత్సరాల జాకబ్ గతంలో కేంద్రమంత్రిగా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మనుగా కూడా వ్యవహరించారు. కేరళలోని రామాపురంలో జన్మించిన జాకబ్ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, కేరళ సేవాదల బోర్డు మెంబరుగా కూడా గతంలో పనిచేశారు. జాకబ్ మరణవార్త వినగానే అనేకమంది రాజకీయ నాయకులు తమ సంతాప సందేశాలను పంపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నరేంద్ర మోదీ కూడా తన సంతాప సందేశంలో జాకబ్ సేవలను కొనియాడారు. ఒక పార్లమెంటేరియన్‌గా, గవర్నరుగా జాకబ్ చెప్పుకోదగ్గ సేవలు అందించారని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళ ప్రాంత అభ్యున్నతి కోసం పోరాడిన నాయకులలో జాకబ్ ఒకరని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మోదీ తెలియజేశారు. 


రాహుల్ గాంధీ కూడా జాకబ్ మరణంపై తన సంతాపాన్ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి జాకబ్ లాంటి గొప్ప వ్యక్తి మరణం తీరని లోటని ఆయన అభిప్రాయపడ్డారు. జాతి నిర్మాణానికి ఒక గవర్నరుగా, మంత్రిగా జాకబ్ అందించిన సేవలు మరువలేనివని రాహుల్ అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భావిస్తున్నానని రాహుల్ తెలిపారు.


9 ఆగస్టు 1927లో జన్మించిన జాకబ్ 1954లో భారత సేవక సమాజంలో సభ్యునిగా చేరారు. జవహర్ లాల్ నెహ్రు, గుల్జారీలాల్ నందా లాంటి నాయకులతో కలిసి పనిచేశారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు జాకబ్ ఆధ్వర్యంలోనే జరిగేవి. కేరళ రాష్ట్ర సహకార రబ్బర్ మార్కెటింగ్ సమాఖ్యకి జాకబ్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. కొట్టాయం జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుకి ఛైర్మనుగా కూడా బాధ్యతలు స్వీకరించారు.