ప్రధాని మోదీని చూస్తుంటే సిగ్గుగా ఉంది: ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్
మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ పై ఆరోపణలు చేసిన ప్రధాని మోదీపై తాజాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ ఘాటుగా స్పందించారు.
నాగ్ పూర్: మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ పై ఆరోపణలు చేసిన ప్రధాని మోదీపై తాజాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ ఘాటుగా స్పందించారు. మన్మోహన్ సింగ్ పై అర్థంపర్థం లేని ఆరోపణలు చేసిన మోదీని చూస్తుంటే సిగ్గుగా ఉంది.. ఎన్నికల్లో గెలవడానికి ప్రధాని స్థాయి వ్యక్తులా ఇలా మాట్లాడేది? అంటూ ప్రశ్నించారు.
'ఒక ప్రధాని స్థాయి హోదాలో ఉంటూ మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు.. మోదీని చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది. ఆయన ఆరోపణలు చేసింది ఒక మాజీ ప్రధాని మరియు భారత రక్షణ శాఖ అధికారులపైన. మోదీ ప్రభుత్వం రైతులను, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పక్కన పెట్టేసింది. గుజరాత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దాయాది దేశం పాకిస్థాన్ జోక్యం చేసుకుందని చెప్పింది. ఇలాంటి అర్థం పర్థం లేని విషయాలు ప్రచారం చేస్తూ ప్రధాని కార్యాలయానికి ఉన్న పరువు, ప్రతిష్టతలు దిగజార్చారు' అని పవార్ మండిపడ్డారు.
గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించేందుకు మణిశంకర్ అయ్యర్ ఇంట్లో మన్మోహన్, చిదంబరం తదితర కాంగ్రెస్ పార్టీ నేతలు పాకిస్థాన్ వ్యక్తులతో కలిసి సమావేశమయ్యారని మోదీ ఎన్నికల ర్యాలీలో ఆరోపించిన సంగతి తెలిసిందే.
'మోదీ మాటలు నన్నెంతగానో బాధపెట్టాయి.. ఆయన దేశానికి ఆయన క్షమాపణ చెప్పాల' మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు. మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా ఖండించారు. మరోవైపు శివసేన పత్రిక సామ్నా కూడా మోదీపై విరుచుకుపడింది.