కోఫీ అన్నన్ కుటుంబాన్ని కలవడానికి స్విట్జర్లాండ్ వెళ్తున్న శశి థరూర్
మాజీ ఐక్యరాజసమితి సెక్రటరీ జనరల్ స్వర్గీయ కోఫీ అన్నన్ కుటుంబాన్ని పరామర్శించడానికి జెనీవా (స్విట్జర్లాండ్) వెళ్లాలని భావిస్తున్నా కాంగ్రెస్ నేత శశి థరూర్‌కి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు అనుమతిని జారీ చేసింది.
మాజీ ఐక్యరాజసమితి సెక్రటరీ జనరల్ స్వర్గీయ కోఫీ అన్నన్ కుటుంబాన్ని పరామర్శించడానికి జెనీవా (స్విట్జర్లాండ్) వెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్ నేత శశి థరూర్‌కి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు అనుమతిని జారీ చేసింది. శశి థరూర్ తన భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మరణానికి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు తెలిపింది. ఏదైనా ముఖ్యమైన విషయానికి సంబంధించి విదేశాలకు వెళ్లాలని భావిస్తే.. కోర్టు నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
తాజాగా థరూర్ న్యాయవాదులు వికాస్ పహ్వా, గౌరవ్ గుప్తాలు థరూర్ జెనీవా పర్యటన కోసం ముందస్తు అనుమతి కోరుతూ కోర్టుకి వినతి పత్రాన్ని సమర్పించారు. శశి థరూర్ జెనీవా వెళ్లి తొలుత కోఫీ అన్నన్ కుటుంబానికి తన సంతాపాన్ని ప్రకటిస్తారని.. ఆ తర్వాత ఐక్యరాజసమితి ప్రధాన కేంద్రానికి వెళ్లి కేరళ వరద బాధితులకు సహాయం కోసం విరాళాలివ్వాల్సిందిగా కోరతారని న్యాయవాదులు వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో శశిథరూర్ కొన్ని రోజులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని మంజూరు చేయడంతో పాటు.. దేశాన్ని విడిచి వెళుతున్నందున సెక్యూరిటీ కింద రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. 1996లో యూఎన్ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్‌కు శశిథరూర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంటుగా పనిచేశారు.