హిమాచల్‌‌ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశా కుమారి సిమ్లాలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న పార్టీ రివ్యూ మీటింగ్‌కు వెళ్లాల్సి ఉండగా.. భద్రత నియమాల ప్రకారం తనను ఆపిన మహిళా కానిస్టేబుల్‌పై ఆగ్రహంతో చేయి చేసుకున్నారు. అయితే వెంటనే కానిస్టేబుల్ స్పందించి... తిరిగి ఎమ్మేల్యేను చెంపదెబ్బ కొట్టడంతో ఆశ్చర్యపోవడం తన వంతైంది. ఈ ఘటన జరిగిన వెంటనే సదరు ఎమ్మెల్యే వివరణ ఇవ్వడం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ఘటన అనుకోకుండా జరిగిందని చెబుతూ... ఆ కానిస్టేబుల్ తనను తిడుతూ వెనక్కి తోసేయడం వలనే తాను కొట్టానని.. తనకు ఆమె తల్లి వయసు ఉంటుందని ఆ మహిళా కానిస్టేబుల్ భావించాల్సిందని ఆమె అన్నారు. అలాగే తన వైపు కూడా తప్పు ఉంది కాబట్టి క్షమాపణ చెబుతున్నానని ఎమ్మెల్యే ఆశా కుమారి తెలిపారు.


అయితే ఈ సంబంధిత ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించడం విశేషం. 'నేను ఈ ఘటన పట్ల సంతోషంగా లేను. ఒకరిపై చేయిచేసుకొనే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదు. పార్టీ వ్యక్తులు క్రమశిక్షణను పాటించకపోతే నేను ఉపేక్షించను' అని ఆయన తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 20 సీట్లతోనే సరిపెట్టుకొని పరాజయం పొందిన సంగతి మనకు తెలిసిందే.