రాహుల్ గాంధీని ప్రశంసించి, బీజేపీకి చురకలంటించిన శివసేన
రాహుల్ గాంధీ బీజేపీకి సవాల్‌గా మారారు : శివసేన
గతంలో బీజేపీతో కలిసి జత కట్టి కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా వెళ్లిన శివసేన తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశంసించడంతో పాటు అతడు బీజేపీకి సవాల్‌గా మారారు అని బీజేపీపై ప్రత్యక్షంగానే విమర్శలు చేసింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తే, తానే ప్రధాని అవుతానని రాహుల్ గాంధీ ప్రకటించడాన్ని బీజేపీ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో బీజేపీ అవలంభిస్తున్న వైఖరిని సైతం శివసేన మరింత తీవ్రంగా తప్పుపట్టింది. " 2017 జూన్‌లో రాష్ట్రపతి ఎన్నికల సమయంలో బీజేపీలో ఎల్.కే. అద్వానీ లాంటి సీనియర్లను వదిలేసి, మిత్ర పక్షాలతో మాట మాత్రమైనా చర్చించకుండా కేవలం ప్రధాని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రమే కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు లేని తప్పు ఇప్పుడు రాహుల్ గాంధీ తానే ప్రధాని అవుతానని ప్రకటించుకుంటే వచ్చిందా " అని బీజేపీని శివసేన సూటింగా ప్రశ్నించింది. తమ సొంత పత్రికలు అయిన సామ్నా, దో పహర్ కీ సామ్నాలో శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది.
" రాహుల్ గాందీ 2014లో వున్నట్టుగా ఇప్పుడు లేరు. తనపై వచ్చిన విమర్శలు, వ్యంగ్యాస్త్రాల్ని అధిగమించి తనని తాను ఓ పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకున్నారు. అందుకే బీజేపీ అగ్రనేతలు ఎన్ని చులకన వ్యాఖ్యలు చేసినా.. రాహుల్ గాంధీ మాత్రం ఎప్పుడూ తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు " అని శివసేన రాహుల్ గాంధీపై ప్రశంసలు గుప్పించింది. శివసేన చేసిన తాజా వ్యాఖ్యలపై బీజేపీ ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి.