ఉల్లి ధరల పెరుగుదల నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై మండిపడిన శివసేన
ఉల్లి ధరలపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరలను అదుపు చేయలేకపోతోందంటూ కేంద్ర ప్రభుత్వంపై శివసేన తీవ్రంగా మండిపడింది. పార్టీకీ చెందిన సామ్నా పత్రిక సంపాదకీయంలో ఉల్లి ధరల పెరుగుదల అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంలోని మోదీ సర్కార్‌పై శివసేన తీవ్ర విమర్శలు చేసింది.
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరలను అదుపు చేయలేకపోతోందంటూ కేంద్ర ప్రభుత్వంపై శివసేన తీవ్రంగా మండిపడింది. పార్టీకీ చెందిన సామ్నా పత్రిక సంపాదకీయంలో ఉల్లి ధరల పెరుగుదల అంశాన్ని ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కిలో 200 రూపాయలకు చేరిందని, అలాగే ఆర్ధిక మందగమనం కొనసాగుతుందని విరుచుకుపడింది. ఈ అంశాన్ని ఒప్పుకోవడానికి కేంద్రం సిద్ధంగా లేదని కేంద్రం తీరును శివసేన తీవ్రంగా తప్పుపట్టింది. ఉల్లి ధరలపై ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టిన శివ సేన.. '' తాను ఉల్లి తిననని.. అందుకే తనను ఉల్లి గురించి అడగవద్దని అనడం ఎంతమేరకు సబబు'' అంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. అదేవిధంగా ప్రధాన మంత్రి కూడా ఉల్లి ధరలపై మాట్లాడటానికి ఇష్టపడటం లేరని సామ్నా సంపాదకీయ కథనం పేర్కొంది.
ఇదే ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెరిగిన ఉల్లి ధరలపై తీవ్ర ఆందోళనలు చేశారని, కూరగాయలను లాకర్‌లో పెట్టి దాచుకోవలిసిన పరిస్థితి వచ్చిందని ధర్నా చేశారని సామ్నా కథనం గుర్తుచేసింది. అదే మోదీ నేడు ప్రధాని అయ్యేసరికి తన విధానాన్ని మార్చుకున్నారని శివసేన విమర్శించింది. ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం నిపుణులు, సలహాల సూచనలు వినడానికి సిద్ధంగా లేదని.. కేంద్రం దృష్టిలో ఎకానమీ అనేది ఒక స్టాక్ మార్కెట్‌ల ఉందని సామ్నా కథనం ఎద్దేవా చేసింది.
నోట్ల రద్దు అంశాన్ని కూడా తమ కథనంలో ప్రస్తావించిన శివసేన.. ప్రధాన మంత్రి కార్యాలయంలో కేవలం కొద్దీ మంది సూచనల మేరకే ఈ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని విమర్శించింది. నోట్ల రద్దుపై తీసుకున్న కేంద్రం నిర్ణయం వలన సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా వ్యతిరేకించగా.. కేంద్రం ఆయనను కూడా తొలగించిందని సామ్నా కథనం ఆరోపించింది.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం 2014లో 55వ స్థానంలో ఉన్న భారత్.. నేడు 107 దేశాలోకెల్లా 102 స్థానంలో ఉండటమే ఆందోళన కలిగించే విషయం అని సామ్నా కథనం పేర్కొంది. సరిహద్దు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలు తమ స్థానాలను మెరుగు పరుచుకుంటుండగా భారత్ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని.. అయినప్పటికీ ప్రధాని మోదీ ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరని సామ్నా ఆరోపించింది.