ఆయన ఒకప్పుడు ఆ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకొచ్చినప్పటికీ.. ఆయనకు సముచిత స్థానం అయితే దక్కలేదు. ఏళ్ల తరబడి వేచిచూసిన ఆ మాజీ ముఖ్యమంత్రి ఇటీవలే ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగే సమయంలో, సమయం చూసి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందనేనో లేక మరో కారణం వల్లో ఏమో తెలియదు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ కూడా తనని విస్మరించిందనే మనస్తాపంతో ఉన్న ఆ సీనియర్ నేత.. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పడానికి సిద్ధపడుతున్నారట!! అవును, ఆయనెవరో కాదు... కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణనే. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతగా ఎదిగి కీలక పదవులు చేపట్టిన ఎస్ఎం కృష్ణ ఆ తర్వాత బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదనే కారణంతోనే ఆయన బీజేపీలో చేరినట్టు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. 


అయితే, ఇప్పుడు బీజేపీ సైతం తనను నిర్లక్ష్యం చేస్తోందని ఎస్ఎం కృష్ణ భావిస్తున్నారట. అందుకే త్వరలోనే రాజకీయ సన్యాసం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టుగా రాజకీయవర్గాల్లో ఓ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఎస్ఎం కృష్ణ ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ జరగనుండగా.. అదే వేదికపై ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారనేది ఆ ప్రచారం సారాంశం. ఎస్ఎం కృష్ణ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటూ తప్పుకుంటూ... తన రెండో కూతురు శాంభవిని తన స్థానంలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి నిజంగానే ఈ సీనియర్ నేత రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతారా లేక తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుని 2019 లోక్ సభ ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారా వేచిచూడాల్సిందే.