కాంగ్రెస్‌తో బేధాభిప్రాయాలు ఉన్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి వ్యాఖ్యలు చేశారు. విలేకర్లతో మాట్లాడిన ఆయన… మంత్రిత్వ శాఖల కేటాయింపులో కాంగ్రెస్‌తో కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. అయితే రాష్ట్రంలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయిలో ఈ సమస్యలు లేవని, రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ అధిష్ఠానం నుంచి ఆమోదం లభించిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్నారు. తాను ఏ సమస్యనైనా తన పరువు, ప్రతిష్ఠల సమస్యగా తీసుకోబోనని తెలిపారు. సమస్యలను పరిష్కరించుకునేందుకే ప్రయత్నిస్తానన్నారు. ఆత్మగౌరవాన్ని వదులుకుని సీఎం పీఠానికి అతుక్కుపోవాలనుకోవటం లేదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘శాఖల కేటాయింపు ఇంకా జరగలేదు. ఈ విషయంలో కాంగ్రెస్‌తో బేధాభిప్రాయాలున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు అధిష్టానం నుంచి ఆమోదం లభించాక కేబినెట్‌ విస్తరణ ఉంటుంది. ఏ సమస్యను పరువు, ప్రతిష్ఠల సమస్యగా తీసుకోను. సమస్యలను పరిష్కరించుకొనేందుకు ప్రయత్నిస్తా. ఆత్మగౌరవాన్ని వదులుకుని సీఎం పీఠానికి అతుక్కుపోను’ అని కుమారస్వామి శనివారం బెంగళూరులో అన్నారు.


ఎన్నికల్లో ఇచ్చిన మాటపై వెనక్కు తగ్గనని చెప్పారు కుమారస్వామి. రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌ నేతలతో చర్చించానని.. వారి నిర్ణయాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కేంద్రంలో నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న ఎన్డీయే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తానన్నారు.